నిత్యానంద స్వామి గుర్తున్నారా? స్వాములు వ్యవహరించాల్సిన తీరుకు పూర్తి భిన్నంగా చెలరేగిపోయి వివాదంలో పడిన సంగతి తెలిసిందే. గురువు దారిలోని నడిచిన ఆయన శిష్యులు కూడా అదే రీతిలో చిక్కుల్లో పడిపోయేలా వ్యవహరించారు. ఉన్నత స్థానంలో ఉండే కంచి మఠం విషయంలో నిత్యానంద శిష్యుల ప్రవర్తన కారణంగా రెండు రోజుల పాటు కంచిలో కలకలం రేగింది. తమిళనాడులోని కాంచీపురం మఠాధిపతి అదృశ్యం అవడం, నిత్యానంద శిష్యుల ప్రవర్తన కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడులో ప్రముఖ సామాజికవర్గమైన మొదలియార్ లకు చెందిన పురాతనమైన జ్ఞానప్రకాశ మఠం కంచిలోని పరమశివన్ వీధిలో తొండమండలలో ఉంది. ప్రఖ్యాతిగాంచిన ఈ మఠానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. మొదలియార్ వంశపారంపర్యంగా ఈ మఠం 232 వ మఠాధిపతిగా గత తొమ్మిదేళ్లుగా జ్ఞానప్రకాశ దేశిక పరమాచార్య స్వామి వ్యవహరిస్తున్నారు. నిత్యానంద శిష్యగణంలోని ఒక పురుషుడు, ఒక స్త్రీ రెండునెలల క్రితం మఠానికి చేరుకుని సేవలతో తరిస్తామంటూ అభ్యర్థించగా దానికి మఠాధిపతి ఓకే చెప్పారు. అయితే ఈ క్రమంలో పీఠం సంప్రదాయలను మార్చివేయడం, భక్తులకు చేరువ అయేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో మొదలియార్ల సంఘంలోని కొందరికి సందేహం వచ్చింది. నిత్యానంద శిష్యులు ఏదో నిర్వాకం చేస్తున్నారని గమనించి ఈ విషయంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే ఈ సమావేశం విషయం చర్చల్లో ఉండగానే మఠం వద్దకు పలువురు వెళ్లిచూడగా మఠం తలుపులు మూసి ఉన్నాయి. దీంతో వారిలో అనుమానం బలపడింది. మఠాధిపతి ఉపయోగించే సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా అది స్విచ్‌డ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో కలకలం రేగింది. మఠాధిపతిని నిత్యానంద శిష్యులు కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేక బృందం రంగంలోకి దిగి మఠం వద్దకు వెళ్లి నిత్యానంద శిష్యులతో చర్చించారు. మూడురోజుల్లోగా మఠాన్ని, మఠాధిపతిని మొదలియార్లకు అప్పగించాలని హెచ్చరించారు. మరోవైపు ఈ పరిణామం వార్తపత్రికల్లో రావడంతో కలకలం రేగింది. అయితే ఈ విషయంలో మఠాధిపతి దృష్టికి సైతం వచ్చింది. దీంతో బెంగళూరులో ఉన్న ఆయన కంచి పోలీసులకు ఫోన్ చేశారు.
ప్రత్యేక పూజల నిమిత్తం తాను బెంగళూరుకు వచ్చినట్లు మఠాధిపతి తెలిపారు. తన ఇష్టపూర్వకంగానే నిత్యానంద శిష్యులతో బెంగళూరు వచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా మొదలియార్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మఠాధిపతి వారు మఠాన్ని కాజేయాలనే కుట్రలో ఉండి ఉంటారని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు మొదలియార్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మఠాన్ని కాజేసేందుకు నిత్యానంద శిష్యులు కుట్రచేసినట్లు కనిపిస్తోందని అన్నారు. మఠానికి సంబంధించిన రూ.2వేల ఆస్తులు తమ సంఘానికి లేదా ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారని సమాచారం.