‘3’ పై మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లాం బాబు..!

Update: 2020-08-07 16:30 GMT
కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం కిందా మీదా పడుతోంది. లాక్ డౌన్ వేళ.. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికి.. ఎప్పుడైతే అన్ లాక్ మొదలైందో.. అప్పటి నుంచి దేశంలో కేసులు పెరగటం మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో పటిష్టమైన చర్యలు తీసుకున్న ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవటం విస్మయానికి గురి చేస్తోంది. రోజుకు పది వేల కొత్త కేసులు నమోదయ్యే పరిస్థితి ఏపీలో నెలకొన్న వైనం షాకింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కరోనాకు సరిసమానంగా మూడు రాజధానుల రచ్చ హాట్ టాపిక్ గా మారింది.

అధికార.. విపక్షాలు మూడు రాజధానుల మీద ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి.. నమ్మించి మోసం చేసినట్లుగా విపక్ష నేత చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేయొద్దంటున్నారు. బాబు తీరుపై ఏపీ అధికారపక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా ట్విట్టర్ల లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. బాబుకు కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయి. రాజధాని మీద స్పష్టత లేకుండా 2014 ఎన్నికల్లో పోటీ చేసింది చంద్రబాబేనన్నారు. రాజధాని వ్యవహారాల్ని ఎన్నికల సమయంలో ప్రజల ముందు పెట్టలేదని.. అందుకు వల్ల ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు రాజధాని అంశం మీద కాదన్నారు. అదే సమయంలో వికేంద్రీకరణ గురించి చెప్పిన శివరామక్రిష్ణన్ కమిటీని పట్టించుకోలేదని గుర్తు చేశారు.

అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ తీసుకున్న నిర్ణయం ఎవరిని సంప్రదించకుండా చేయటమే కాదు.. ఏకపక్షంగా ఎంపిక చేసిన వైనాన్ని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సర్లేనని అనుకున్నా.. బాబు కాలంలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణాన్ని పూర్తి చేయలేదన్న వైనాన్ని గుర్తు చేశారు. అటు రైతులకు న్యాయం చేయలేదని.. ఇటు అమరావతి కట్టలేదు కదా? అని ప్రశ్నించారు. మరో ట్వీట్ లో ఆయన మరింత కొత్త విషయాన్ని వెల్లడించారు.

2019 ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో మూడు ప్రాంతాల్ని సమగ్రంగా డెవలప్ చేస్తామని చెప్పామని.. దానికి ప్రజలు 151 సీట్ల మెజార్టీని ఇచ్చి గెలిపించారన్నారు. ‘‘మూడు ప్రాంతాల్ని సమగ్రంగా డెవలప్ చేస్తామని చెప్పాం. మా నాయకుడు ప్రజల ముందుకువెళ్లింది ఆ మేనిపెస్టోతో ఎన్నికలకు వెళితే 151 సీట్లతో గెలిపించారు. ఇప్పుడు చెప్పండి బాబుగారు? ప్రజలు తీర్పు కోరాల్సింది మీరా? మేమా?’’ అంటూ ప్రశ్నించారు.
Tags:    

Similar News