పవన్ అనని మాటల్ని అన్నట్లుగా చెప్పటమా?సజ్జల టాలెంటే వేరులే!

Update: 2022-05-10 14:30 GMT
ప్రత్యర్థి మీద దుమ్మెత్తి పోయాలి. చేతనైంత బురదను వొంపి వెళ్లాలంటే ఏం చేయాలి? అయితే.. దమ్ముగా ఆ పని చేసేయటం.. కుదరకపోతే.. ఆ ప్రత్యర్థి మీద ఉన్నవి లేనివి అన్ని చెప్పేసి.. తన దారిన తాను పోవటం మరో పద్దతి. చూసేందుకు పెద్ద మనిషిలా.. మాట్లాడే ప్రతి మాటలోనూ లా పాయింట్ ఉన్నట్లుగా వాదనలు వినిపించే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తమ అధినేతకు నష్టం జరిగే ఏ విషయాన్ని అయినా సరే.. తమకు తగ్గట్లుగా మార్చేసి.. అదేదో మహా పాపం జరిగిపోయినట్లుగా బిల్డప్ ఇస్తుంటారు సజ్జల.

తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు.. పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఎందుకిలా? అంటే.. పొత్తుల విషయం.. జగన్ సర్కారు వ్యతిరేక ఓటు చీలనివ్వమన్న దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసిన పవన్ మాటలు వైసీపీ వర్గాల్లో మంట పుట్టి ఉన్నాయన్న విషయం సజ్జల ప్రెస్ మీట్ ను చూస్తే అర్థమైపోతుంది. పవన్ నోట రాని మాటల్ని.. ఆయన అన్నట్లుగా ప్రచారం చేయటంలో సజ్జల తర్వాతేనని చెప్పాలి.

చంద్రబాబు ఒక వైపు త్యాగం చేస్తానంటారు.. మరోవైపు తానే లీడ్ చేస్తానంటారు.. ఇంకోవైపు నేనే సీఎం అని పవన్ అంటున్నారన్న సజ్జల మాటలు వాస్తవానికి ఏ మాత్రం సూట్ కాని రీతిలో ఉన్నాయని చెప్పాలి. తాజాగా కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేయటం తెలిసిందే.

తనకు ఏ పదవి అక్కర్లేదని.. అధికారం కోసం రాజకీయం చేయనని.. ప్రజల కష్టాలు తీరాలన్నదే తన సంకల్సమని చెప్పటం తెలిసిందే. తనకు పదవుల కన్నా.. మీ గుండెల్లో ఉన్న పదవి సరిపోతుందన్న పవన్ మాటల్ని.. సజ్జల మాష్టారు ఎంతలా ట్విస్టు చేశారో ఇట్టే తెలుస్తుంది. ఒకవేళ పవన్ కర్నూలు జిల్లా పర్యటనను ఎవరైనా ఫాలో కాకుండా.. నేరుగా సజ్జల ప్రెస్ మీట్ చూస్తే.. నిజంగానే పవన్ పదవుల కోసం వెంపర్లాడుతున్నాడని.. సీఎం కావాలని కోరుకుంటున్నారని అనుకోవటం ఖాయమనిపిస్తుంది.

అంతేకాదు.. సజ్జల తన టాలెంట్ ను చూపిస్తే.. పొత్తులపై చంద్రబాబు.. పవన్ కు ఇంత తొందరెందుకో అర్థం కావట్లేదన్నారు. విపక్షాలు తాము చేసే కార్యక్రమాల్ని సైతం ఏపీ అధికారపక్షం మనసుకు నచ్చేలా చేయాలా? అన్నది ప్రశ్న. ఇప్పటికే సింగిల్ గా రావాలా? డబుల్ గా రావాలా? లాంటివి మీరు డిసైడ్ చేయటమేంటి? అది నా ఇష్టమన్న పవన్ మాటలకుసూటిగా సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే విషయంలో సజ్జల ఎంత షార్ప్ గా ఉంటారో తెలిసిందే.

చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కార్యక్రమాలు.. నినాదాలు ఉంటాయన్న సజ్జల.. తాజాగా పవన్ చేస్తున్న కౌలు రైతుల యాత్ర అందులోనిదే అని ఆయన ఎద్దేవా చేశారు. సజ్జల మాటలో సత్యం లేకున్నా.. కాసేపు ఆయన మాటలే నిజం అని అనుకుందాం. అసలుకౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోతే.. పవన్ పర్యటించాల్సిన అవసరం లేదు.. చంద్రబాబుప్లాన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా? కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగిన తర్వాత.. ఓటు బ్యాంకు సంక్షేమ పథకాల మాదిరి.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు భారీ ప్యాకేజీలు ప్రకటించి ఉంటే.. పవన్ కు యాత్ర చేయాల్సిన అవసరమే ఉండేది కాదు కదా?

ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే. తమ చేతకానితనాన్ని  ఒప్పుకోని సజ్జల వారు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ప్రత్యర్థులపై ఏదో ఒక బురద జల్లటం తప్పించి.. మరొకటి ఉండదని చెప్పకతప్పదు. జగన్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలకు తాను వ్యతిరేకం కాదన్న పవన్ లాంటి నికార్సైన రాజకీయ నేతను సైతం ఏదో ఒక బురద అంటించటం ద్వారా.. ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్న సజ్జల లాంటి వారి మాటలు అత్యంత ప్రమాదకరమన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News