ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని చెప్పేసిన సజ్జల

Update: 2021-11-11 04:30 GMT
ఒకటి తర్వాత ఒకటి చొప్పున వస్తున్న ఎన్నికల పరంపరలో.. రోజు క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావటం తెలిసిందే. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ద్వారా ఎన్నిక జరుగుతుంటే.. ఎమ్మెల్యే కోటా ద్వారా ఎన్నికయ్యే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ద్వారా ఎన్నికలు నిర్వహించే దానికి సంబంధించి మొత్తం 13 జిల్లాల్లో ఏడు జిల్లాల్లోని ఖాళీల్ని భర్తీ చేయనున్నారు.

అనంతపురంలో ఒకటి.. క్రిష్ణాలో రెండు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి.. గుంటూరు జిల్లాలో రెండు.. విజయనగరం జిల్లాలో ఒకటి.. విశాఖ.. ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ద్వారా ఎన్నికయ్యే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇఫ్పటికే వెల్లడైంది. మే 31 తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. అహ్మద్ షరీఫ్.. గోవింద రెడ్డి దేవసాని.. సోము వీర్రాజులు ఉన్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ అధికారపక్షం ఈ మూడు స్థానాలకు సంబంధించిన తమ అభ్యర్థుల్ని ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్.. కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా.. కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి ఉన్నారు. దీంతో.. ఈ మధ్యనే పదవీ కాలం ముగిసిన ముగ్గురిలో ఒకరు తాజాగా మరోసారి ఎంపికయ్యారు.

ఈ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈ నెల 16 మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుపుతారు. అసెంబ్లీలో అధికార వైసీపీకి పూర్తిస్థాయిలో సంఖ్యా బలంగా ఉండటంతో.. ఆ పార్టీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం కావటం ఖాయం. తాజాగా ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ.. వారు ఎమ్మెల్సీ కావటం కేవలం లాంఛనప్రాయమేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News