32 ఏళ్ల‌కు తీర్పు..కాంగ్రెస్ నేత‌కు జీవిత ఖైదు

Update: 2018-12-17 08:49 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కేసులో...సుదీర్ఘ కాలం త‌ర్వాత తుది తీర్పు వెలువ‌డింది. 1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టులో సజ్జన్ కుమార్‌ ను నిర్దోషిగా తేల్చగా.. ఆ తీర్పును హైకోర్టు తిరగరాసింది. ఈ నెల 31లోపు కోర్టులో లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌ కుమార్‌ ను ఆదేశించింది. 32 ఏళ్ల త‌ర్వాత వెలువ‌డిన తీర్పులో త‌మ క్ల‌యింట్ల‌కు న్యాయం జ‌రిగింద‌ని బాధితుల త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు.

1984 - నవంబర్ 1న ఢిల్లీ కంటోన్ మెంట్ ఏరియాలోని రాజ్‌ నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కులను ఊచకోత కోసిన కేసులో సజ్జన్‌ కు శిక్ష పడింది. ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చగా.. కాంగ్రెస్ కౌన్సిలర్ బల్వాన్ ఖోఖర్ - రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ భాగమల్ - గిరిధర్ లాల్ - మరో ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురికీ ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2013 - మేలోనే వీళ్లకు ఈ శిక్ష పడగా.. వాళ్లంతా శిక్షను సవాలు చేశారు. అయితే సజ్జన్ కుమార్‌ ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రణాళిక బద్ధంగా సాగిన ఈ మత హింసలో ఆయనకు కూడా పాత్ర ఉన్నదని సీబీఐ వాదించింది. అక్టోబర్ 29నే మురళీధర్ - వినోద్ గోయెల్‌ లతో కూడా హైకోర్టు ధర్మాసనం విచారణను పూర్తి చేసి.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సోమవారం సజ్జన్‌ ను దోషిగా తేల్చుతూ జీవిత ఖైదు విధించింది.


Tags:    

Similar News