ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ సైకిల్‌కే!

Update: 2017-03-11 11:32 GMT
నిజ‌మే... గ‌డ‌చిన వారం - ప‌ది రోజులుగా చ‌ర్చ సాగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎవ‌రికంటే... సైకిల్ పార్టీకే. సైకిల్ పార్టీ అంటే... టీడీపీ మాత్ర‌మే కాదుగా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అధికారంలో ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ గుర్తు కూడా సైకిలేగా. నేటి ఉద‌యం అత్యంత ఉత్కంఠ‌పూరిత వాతావ‌ర‌ణంలో మొద‌లైన ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టికే దాదాపుగా ఫ‌లితాలు వ‌చ్చేశాయి. బీజేపీకి పెద్ద బూస్టింగ్ ఇచ్చేలా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వ‌చ్చేసింది. ఇక గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం ఎదురైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు ఈ ఎన్నిక‌లు కాస్తంత ఊపిరి పీల్చుకునే ఫ‌లితాల‌నిచ్చాయ‌నే చెప్పాలి. ఊపిరి కంటే కూడా ఈ ఫ‌లితాలు కాంగ్రెస్ పార్టీకి పున‌ర్జ‌న్మ అంటే బాగుంటుందేమో.

ఎందుకంటే కేంద్రంలోత‌న‌ను మ‌ట్ట‌టి క‌రిపించిన బీజేపీ చేతిలోని రెండు రాష్ట్రాల‌ను ఆ పార్టీ ఈజీగానే కైవ‌సం చేసేసుకుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎంతో గొప్ప‌గా చెప్పుకునే కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారీకర్ సొంత రాష్ట్రంలో బీజేపీ చేతిలో నుంచి ఆ రాష్ట్ర ప‌గ్గాల‌ను కాంగ్రెస్ దాదాపుగా లాగేసుకుంది. అంతేనా.. దేశ రాజధాని ఢిల్లీకి పొరుగు రాష్ట్రంగా ఉన్న పంజాబ్ లో బీజేపీ-అకాలీద‌ళ్ కూట‌మికి పెద్ద దెబ్బే కొట్టిన కాంగ్రెస్‌... ఆ రాష్ట్ర పాల‌నా ప‌గ్గాల‌ను చేజిక్కించుకుంది. అంటే యూపీ గెలుపుతో బీజేపీకి - పంజాబ్‌ - గోవాల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి విజ‌యాలు ద‌క్క‌గా.. మ‌రి ఓడిన పార్టీ ఏద‌న్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మ‌న‌కు సైకిల్ పార్టీగా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీనే క‌నిపిస్తోంది.

పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల నేప‌థ్యంలో మొన్న‌టిదాకా పార్టీ చీఫ్ గా వ్య‌వ‌హ‌రించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ చేతిలోని పార్టీని ఆయ‌న కుమారుడు, ప్ర‌స్తుత ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ లాగేసుకున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందుగా ఆ పార్టీలో చోటుచేసుకున్న ప‌రిణామాలే ఆ పార్టీ ఘోర ప‌రాజ‌యానికా కార‌ణాల‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా... జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ - బీజేపీలు... ఒక రాష్ట్రంలో ఓడితే... మ‌రో రాష్ట్రంలోనైనా విజ‌యం సాధించాయి. మ‌రి త‌న అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంలో... అది కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టిన‌ప్ప‌టికీ... ఓట‌మి పాలైన స‌మాజ్ వాదీ పార్టీ మాత్ర‌మే ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీగా మ‌న‌కు క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News