ఓడిపోయినోళ్లంతా అదే మాట చెబుతున్నారే!

Update: 2019-05-25 11:20 GMT
ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యానికి గురి కావ‌టం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించ‌టం తెలిసిందే. తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల నేప‌థ్యంలో అన్నిపార్టీల్లోనూ హేమాహేమీలైన నేత‌ల్ని నిర్దాక్షిణ్యంగా ఓడించారు ఓట‌ర్లు. అందుకు నిద‌ర్శ‌నంగా ఏపీ మాజీ మంత్రి లోకేశ్ ఓటమి ఒక‌టిగా చెప్పాలి. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న్ను.. ఓటర్లు దారుణ‌మైన ప‌రాభ‌వానికి గురి చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారీ ఎత్తున సీట్ల‌ను సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల్లో కొంద‌రు దుర‌దృష్ట‌వంతుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151.. 25 లోక్ స‌భ స్థానాల‌కు 22 స్థానాల్లో విజ‌యం సాధించిన వేళ‌.. ఓడిన వారి ప‌రిస్థితి దారుణంగా ఉంది.

అంద‌రూ గెలిచి.. తాము మాత్ర‌మే ఓడిపోవ‌టంపై కిందా మీదా ప‌డుతున్నారు ప్ర‌ముఖులు కొంద‌రు. అలాంటి వారిలో విజ‌య‌వాడ ఎంపీస్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ పొట్టిగా చెప్పాలంటే పీవీపీగా సుప‌రిచితుడు. విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసిన ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. మ‌రో వ్యాపార‌వేత్త కేశినేని నాని చేతిలో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు.

తాజాగా విడుద‌లైన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఓట‌మి చెందిన వారినోటి నుంచి ఒకేలాంటి మాట‌లు వ‌స్తున్నాయి. తాము ఓడిన‌ప్ప‌టికీ తాము నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటామ‌ని.. దూరం వెళ్ల‌మ‌ని చెబుతున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లుచేశారు. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల గురించి ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా తాను పోరాడ‌తాన‌ని చెప్పారు.

నిజానికి ఈ మాట ఒక్క ప‌వ‌న్ మాత్ర‌మే కాదు.. పీవీపీ మొద‌లుకొని ప‌లువురు నేత‌ల నోటి నుంచి వ‌స్తోంది. ఏపీ మంత్రి. దారుణ ఓట‌మిని త‌న ఖాతాలో వేసుకున్న నారా లోకేశ్ సైతం ఇదే రీతిలో స‌మాధానం చెప్ప‌టం గ‌మ‌నార్హం. తానిక రెగ్యుల‌ర్ గా నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటాన‌ని.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని పీవీపీ భ‌రోసా ఇచ్చారు. ఎన్నిక‌ల వేళ‌.. తాను ప్ర‌చారం చేయ‌టానికి త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టం వ‌ల్ల ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డినట్లు ఆయ‌న చెబుతున్నారు. తాను ఎన్నిక‌ల బ‌రిలో దిగి కేవ‌లం 19 రోజులే ప‌ర్య‌టించ‌టం వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ కాలేద‌న్న వాద‌న‌ను వినిపిస్తోంది. ఏమైనా. న‌లుగురు న‌డిచే బాట‌లో పీవీపీ న‌డ‌వాల‌నుకుంటున్న‌ట్లుగా ఆయ‌న ఉన్నాయ‌ని చెప్పాలి.
Tags:    

Similar News