చిదంబరం మాష్టారికి ఇంటి భోజనానికి నో చెప్పేసిన కోర్టు

Update: 2019-09-13 05:36 GMT
దేశంలో అత్యున్నత పదవుల్లో సాగిన రాజకీయ ప్రముఖులు.. పదవీ కాలంలో చేయకూడని పనులు చేస్తే.. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దానికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం మాష్టారు నిలువెత్తు రూపంగా నిలుస్తారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయనకు.. ఊహించని రీతిలో కోర్టు నుంచి ఎదురదెబ్బ తగిలింది.

ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు ఇంటి నుంచి భోజనం చేసేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత కమ్ ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అనుమతి ఇవ్వలేదు. మాజీ కేంద్రమంత్రి బెయిల్ పిటిషన్ నేపథ్యంలో ఆయనకు ఇంటి నుంచి భోజనం తినే అవకాశం ఇవ్వా్ల్సిందిగా కోరారు. ఇందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలుగజేసుకొని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు.

ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇంటి భోజనానికి నో చెప్పారు. జైల్లో ఉన్న అందరికి ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుందన్నారు. అయితే.. తన క్లయింట్ వయసు 74 ఏళ్లు అని.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కపిల్ సిబాల్ వాదించగా.. ఆయన్న మాటల్ని కోర్టు కొట్టి పారేసింది.

సీనియర్ నేత ఓమ్ ప్రకాశ్ చౌతాలా వయసు 84 ఏళ్లు అని.. రాజకీయ ఖైదీగా ఆయన ఉన్నప్పటికీ జైల్లో సాధారణ భోజనమే అందుతుందని చెప్పటం ద్వారా.. చిదంబరం మాష్టారికి ఇంటి భోజనం తినే అవకాశం లేదన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేసిందని చెప్పాలి. అత్యున్నత స్థానాల్లో ఉంటూ.. కీలక పదవులు చేపట్టిన నేతలకు.. చివరకు ఇంటి భోజనం కూడా లేకపోవటం గమనార్హం.
Tags:    

Similar News