వైసీపీ నేతల సేమ్ మిస్టేక్స్

Update: 2022-06-17 17:30 GMT
ఎప్ప‌టిక‌ప్పుడు వైసీపీ త‌ప్పులు చేస్తూనే ఉంది. పాత‌వి దిద్దుకోకుండానే కొత్త‌వి చేస్తూనే ఉంది.ఈ కార‌ణంగానే వైసీపీ త‌రుచూ వివాదాల్లోకి వెళ్లిపోతోంది. ఈ కార‌ణంగానే విప‌క్షాల‌కు ఆయుధాలు అందించి కొన్ని సార్లు త‌న‌కు తెలియ‌కుండానే అస్త్ర స‌న్యాసం చేస్తోంది. ఇదే విష‌యం అనేక సార్లు ప‌వ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్య‌లతో నిరూప‌ణ అయింది. అయినా కూడా వైసీపీ దీనిని గుర్తించలేదంటున్నారు విశ్లేషకులు. అందుకే తాజాగా చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్య‌ల‌తోనూ మళ్లీ బోల్తాపడిందంటున్నారు.

ఇదే విధంగా రాజ‌కీయం చేస్తూ పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశించిన ఫ‌లితాలు అయితే అందుకోలేదని వారు అంటున్నారు. ముఖ్యంగా  విమ‌ర్శ‌ను స్వీక‌రించే గుణం లేన‌ప్పుడు ఎవ్వ‌రం ఏమీ చేయలేం అని ఎన్నో సార్లు బొత్స లాంటి సీనియ‌ర్లే నెత్తీ నోరూ కొట్టుకున్నారు.

ఏం చెప్పినా వినిపించుకునే గుణం లేన‌ప్పుడు మ‌నం మాట్లాడినా ఆ మాట‌ల‌కు విలువ ఉండ‌దు అని పార్టీ శ్రేయోభిలాషుల ఆవేదన.  వైఎస్సార్ కూ, ఆయ‌న బిడ్డ‌కూ ఇదే తేడా అని, ఆయ‌న్ను ఎదిరించి మాట్లాడితే న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చేవార‌ని, ఈయ‌న మాత్రం అస్స‌లు ఒప్పుకోరు అని సీనియర్లు అనడం ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది.

తాజాగా మంత్రి కాకాణి మ‌ళ్లీ చెల‌రేగిపోయారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి  నోరు జారిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం అని, ఆ దీపానికి చేతులు అడ్డు పెట్టి పవన్ కల్యాణ్ కాపాడాలనుకుంటున్నారని విమ‌ర్శించారు. దీనిపైనే ఇప్పుడు పెద్ద ల‌డాయి నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆరిపోయిన దీపం లాంటిద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రు అని ? ప్ర‌శ్నిస్తూ మంత్రి ప‌ద‌వి రాగానే అనిల్ మాదిరిగానే స్థాయి మ‌రిచి గొంతు పెంచి మాట్లాడి ఇత‌రుల‌ను చిన్న‌బుచ్చ‌డం త‌గ‌ని ప‌ని అని... మీ టైం దగ్గర పడిందని పసుపు క్యాడర్ హెచ్చరిస్తోంది. విప‌క్షాన్ని అదే ప‌నిగా తిట్టిపోస్తే తమ బలం పెరుగుతుందనుకోవడం భ్రమ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

ప‌వ‌న్ ను ఉద్దేశించి కానీ చంద్ర‌బాబును ఉద్దేశించి కానీ అదే ప‌నిగా తిట్టి తిట్టి  కాకాణికి ఉపయోగం లేదని... నియోజకవర్గ జనాలు మెచ్చకున్నారా లేదా అన్నదే ప్రామాణికం అని అంటున్నారు.
Tags:    

Similar News