సంపూర్ణేష్ ట్వీట్‌..బాబు బ్యాచ్ కు మ‌హా ఇబ్బందే

Update: 2018-03-23 10:25 GMT
కొంద‌రి తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. త‌న ఎంట్రీతోనే రోటీన్‌కు భిన్న‌మంటే ఏమిటో చూపించిన సంపూర్ణేష్ బాబు.. నిజాన్ని నిజంగా ఒప్పుకోవ‌టంలోనే అత‌డి స‌క్సెస్ ఉంద‌ని చెప్పాలి. ఎక్క‌డా కూడా.. త‌న‌ది కానిది తాను ప్ర‌ద‌ర్శించ‌డు. లేని అహాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం అత‌నికి చేత‌కాదు. అదే అత‌డ్ని చాలామందిని అభిమానిని చేసింది. టాలీవుడ్ లో ఇలాంటి క‌థానాయుడు కూడా ఉన్నాడా? అన్న మాట సంపూర్ణేష్ బాబును చూసి అంటారుకానీ.. ఏం ఉంటే త‌ప్పేంటి? అని స‌గ‌టు అభిమాని చేత ఎదురు ప్ర‌శ్న వేయించేలా చేశాడు త‌న మంచిత‌నంతో.

ఎల్ల‌ప్పుడు మీ ప్రేమ‌కు బానిస అంటూనే..అంద‌రిని త‌న అభిమాన బానిస‌ల‌య్యేలా చేసిన సంపూర్ణేష్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. బాబు బ్యాచ్ కు ఊపిరి ఆడ‌న‌ట్లుగా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమిటంటే.. త‌న తాజా ట్వీట్ లో ఎవ‌రిని ఎలాంటి మాట అన‌లేదు. ప‌ల్లెత్తు విమ‌ర్శ చేయ‌లేదు. జ‌స్ట్‌.. జ‌రిగిన విష‌యాన్ని జ‌రిగిన‌ట్లు మాత్ర‌మే చెప్పాడంతే. ఇంత‌కీ సంపూర్ణేష్ ఏం చెప్పాడన్న‌ది చూస్తే.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం గ‌తంలో వైజాగ్ లో ఒక ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి పిలుపునివ్వ‌టం తెలిసిందే. అదే స‌మ‌యంలో వైజాగ్ లో ఒక అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆందోళ‌న‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

హోదా సాధ‌న కోసం వైజాగ్ మొత్తం మాన‌వ‌హారంగా ఏర్ప‌డాల‌న్న ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు. దీనికి సినీ న‌టులు త‌మ మ‌ద్ద‌తు ప‌లికినా.. సంపూర్ణేష్ బాబు మాత్రం వైజాగ్ వెళ్లారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకొని.. అరెస్ట్ చేసి త‌ర్వాత విడిచిపెట్టారు. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. హోదా సాధ‌న‌లో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు బాధ్య‌త లేదా?.. అంటూ ప్ర‌శ్నించిన నేప‌థ్యంలో త‌న ట్వీట్ తో సంపూర్ణేష్ స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

"సినిమా వాళ్ల‌కు బాధ్య‌త లేదా అని ప్ర‌శ్నించే గౌర‌వ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారికి విన్న‌వించేది ఏమిటంటే.. అనాడు ఉద్య‌మానికి సంఘీభావంగా  వైజాగ్ వెళితే అరెస్ట్ చేస్తార‌ని తెలిసి వెళ్ల‌టం జ‌రిగింది.అంత‌ర్జాతీయ స‌మ్మిట్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో వైజాగ్ పోలీసులు త‌మ బాధ్య‌త‌లో భాగంగా అరెస్ట్ చేసి సెల్ లో పెట్ట‌టం జ‌రిగింది. అందులో ఎలాంటి త‌ప్పు లేద‌ని మ‌న‌సావాచా న‌మ్ముతున్నా. ఇప్ప‌టికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో.. ముఖ్యంగా హోదా విష‌యంలో మ‌న‌కి జ‌రుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. పార్టీల‌కు అతీతంగా ఎవ‌రు పిలిచానా మీతో క‌లిసి వ‌చ్చి పోరాడ‌టానికి సిద్ధంగా ఉన్నా" అంటూ ట్వీట్ చేశారు.

నాడు మాన‌వ‌హారానికి టీడీపీ స‌ర్కారు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌టం.. టీడీపీ త‌మ్ముళ్లు ఎవ‌రూ అందులో హాజ‌రుకాక‌పోవ‌టాన్ని గుర్తుకు తెచ్చేలా సంపూర్ణేష్ పోస్ట్ ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. నాడు తన‌ను పోలీసులు సెల్ లో పెట్టిన ఫోటోను ట్వీట్ లో భాగంగా పెట్టిన వైనం చూస్తే.. ఈ రోజు హోదా సాధ‌న కోసం చించేసుకుంటున్న త‌మ్ముళ్లు నాడేం చేశాడ‌న్న ప్ర‌శ్న‌ను త‌న పోస్ట్ తో గుర్తు చేశాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తానికి సంపూర్ణే థియ‌రీనే కాస్త భిన్నంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News