భారత్ కు మొక్కుతున్న దిగ్గజ క్రికెటర్లు!

Update: 2022-04-08 15:30 GMT
1996 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్.. టీమిండియా దారుణంగా ఆడి నిష్క్రమించింది. అప్పటికి సొంతగడ్డపై కప్ జరుగుతుండడంతో మనదేననే ధీమాలో ఉన్న అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నాటి మ్యాచ్ ను కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చూసినవారు తట్టుకోలేకపోయారు. గ్రౌండ్ లోకి నీళ్ల సీసాలు విసిరేసి నిరసన తెలిపారు. దీంతో మ్యాచ్ ను మధ్యలోనే ముగించి ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటించారు. అంతకుముందటి లీగ్ మ్యాచ్ సహా సెమీ ఫైనల్ పరాజయంతో టీమిండియాకు ఆ జట్టు చేతిలో కొన్నేళ్లపాటు పరాజయాలే పరాజయాలు.

ఏకంగా టెస్టుల్లోనూ 952 పరుగుల అత్యధిక స్కోరుతో భారత్ ను ఏడిపించింది. అయితే, ఓ మూడేళ్లకు ఆ జట్టు ప్రభావం తగ్గడం మొదలైంది. క్రమక్రమంగా ఓ సాధారణ జట్టులా మారింది. ప్రస్తుతం టీమిండియాకు కనీసం పోటీ ఇచ్చే స్థితిలోనూ లేదు. ఆ జట్టే శ్రీలంక. 1996 ప్రపంచ కప్ లో దానిని నడిపించింది అర్జున రణతుంగ. అతడి సారథ్యంలో భారీ స్కోర్లు, సెంచరీలపై సెంచరీలతో భారత్ ను ఏడిపించింది సనత్ జయసూర్య. ఈ ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ ఇప్పడు వీరిద్దరూ భారత్ ను దేవుడంటూ మొక్కుతున్నారు. ప్రధాని మోదీని ఆకాశానికెత్తుతున్నారు.

రుణపడి ఉంటాం..ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ దాటేసి.. ఆహారం, ఇంధనం, గ్యాస్, విద్యుత్ సమస్యలతో శ్రీలంక తీవ్ర  సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అలాంటి లంకకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్‌ ముందుకొచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా.. చమురు సాయాన్నీ అందిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశానికి 2.7లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసింది.

సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్‌ అందిస్తోన్న సాయం పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌ను పెద్దన్నగా అభివర్ణించాడు. "మా పొరుగు దేశం, పెద్దన్న అయిన భారత్‌ మాకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది. భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మేం రుణపడి ఉంటాం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంక్షోభం నుంచి కోలుకోవడం అంత సులువైన పని కాదు. కానీ, భారత్‌ లాంటి దేశాలు ఆదుకుంటే దీన్నుంచి త్వరగా బయటపడతామని ఆశిస్తున్నాం"అని  జయసూర్య తెలిపాడు. ఇక జాఫ్నా విమానాశ్రయ ప్రారంభానికి గ్రాంట్ ఇచ్చేందుకు సమ్మతించిన భారత్ ను రణతుంగా కొనియాడాడు. "భారత్ మాకు సోదరుడు. పెట్రోల్, ఔషధాలను సరఫరా చేస్తూ పెద్ద ఎత్తున సాయం చేస్తోంది" అని ప్రశంసించాడు. కాగా, భారత్‌ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయంలో భాగంగా బుధవారం 36,000 మెట్రిక్‌ టన్నుల పెట్రోల్‌, 40000 మెట్రిక్‌ టన్నుల డీజిల్‌తో రెండు కన్సైన్‌మెంట్‌లను శ్రీలంకకు అందజేసినట్లు చేసినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ క్రెడిట్‌ లైన్‌ కింద 2,70,000 మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల చమురును సరఫరా చేసినట్లు తెలిపింది.

పరిస్థితులు మరింత దిగజారుతాయా? శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆ దేశ పార్లమెంట్‌ స్పీకర్ చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఈ సంక్షోభం కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఆకలితో అలమటిస్తామని స్పీకర్‌ మహింద యాప అబేయవర్ధనే హెచ్చరించారు. ఆహారం, గ్యాస్‌, విద్యుత్తు కొరత మరింత క్షీణించనుందని అన్నారు. మరోవైపు, సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ విధానాలతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న పౌరులు తమ ఆందోళనలు ముమ్మరం చేశారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News