అడ్డుకున్న అధికారుల పై ఇసుకమాఫియా దాడి!!

Update: 2020-06-20 05:45 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. స్వయంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమకు గుప్పెడు ఇసుక దొరకడం లేదని వాపోతున్నారు. తాజాగా మంత్రికే మస్కా కొట్టి ఇసుకకు బదులు మట్టిని పోసిన వైనం తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది.

ఇంతటి కరువు ఇసుక కాలంలో ఇసుక మాఫియాలు పుట్టుకొస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా మరింతగా రెచ్చిపోతోంది. ఏకంగా అధికారుల పై దాడుల వరకు వెళ్లిందంటే  ఏపీలో ఇసుక మాఫియా ఎంతటి అరాచకాలకు గురిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మలపూడి సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అక్కడికి వెళ్లారు. ఆ మాఫియా ట్రాక్టర్లను అడ్డుకోవడానికి రోడ్డుపై నిలుచుకున్నారు.

కాగా ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల పై ఇసుక మాఫియా హత్యాయత్నం చేసింది. అధికారులను ఇసుక మాఫియా ట్రాక్టర్లతో గుద్దడంతో ఇద్దరు అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆరాతీస్తున్నారు.

ఏపీలో ఇసుక కొరతతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి ఇసుకను దోపిడీ చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అడ్డువచ్చిన అధికారులను అడ్డంగా బలితీసుకుంటున్న దారుణం వెలుగుచూస్తోంది.
Tags:    

Similar News