డ్రగ్స్ కేసు నుంచి బయటపడేందుకు జుట్టు కట్ చేసుకుంటున్నారట

Update: 2021-04-07 05:32 GMT
సంచలనంగా మారిన బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలు.. వ్యాపారస్తులు.. సినీ తారలకు లింకు ఉందన్న సమాచారం బయటకు వెల్లడైంది. పోలీసులు.. విచారణ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయనప్పటికీ.. డ్రగ్స్ భాగోతం ఆయా వర్గాల్ని హడలెత్తిస్తోంది. ఇదిలా ఉండగా..ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రముఖులు పలు మార్గాలు వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. పోలీసుల వద్దకు విచారణకు వెళ్లే సమయానికి ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అవన్నీ చేసేందుకు తయారవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వారి రక్తం.. మూత్రం శాంపిళ్లతో పాటు వారి తల వెంట్రుకల ద్వారా కూడా ఆధారాలు లభించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్ ఆనవాళ్లు జుట్టు కొసల్లో కూడా లభిస్తాయని చెబుతున్నారు.

ఒకసారి డ్రగ్స్ వినియోగించిన వారికి.. ఆ ఆనవాళ్లు వారి జుట్టులో తొంభై రోజుల పాటు ఉండే వీలుందని చెబుతున్నారు. అందుకే.. అలాంటి అవకాశం దొరకకుండా ఉండేందుకు.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు పలువురు జుట్టును కత్తిరించుకునే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే బెంగళూరులోని ఒక ప్రముఖ హోటల్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న రాజకీయ.. సినీ వ్యాపార రంగానికి చెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న బెంగళూరు పోలీసులు..సీసీ కెమేరా ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా పార్టీకి హాజరైన వారిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ పార్టీకి వెళ్లిన వారు.. పోలీసులు తమను గుర్తించి విచారణకు పిలిచే సమయానికి తమ నుంచి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి.. దీనికి పోలీసులు ఎలాంటి పైఎత్తు వేస్తారో చూడాలి.
Tags:    

Similar News