సండ్ర‌కు రేవంత్ పోస్ట్‌.. ఖాయ‌మేనా!

Update: 2017-10-30 05:32 GMT
తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ నేత‌గా ఉన్న కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి, త‌న శాస‌న స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఈయ‌న ప‌ద‌విని ఎవ‌రికి ఇస్తారు? ఆ ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో టీడీఎల్పీ ప‌ద‌విని పార్టీ సీనియ‌ర్ నేత సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు అప్ప‌గిస్తార‌నే వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. 2014 నాటి ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ 15 మంది ఎమ్మెల్యేల‌ను సాధించినా ప్ర‌స్తుతం రేవంత్ వెళ్లిపోగా కేవలం ఇద్ద‌రు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు సండ్ర వెంక‌ట వీర‌య్య కాగా, మ‌రొక‌రు బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌. కృష్ణ‌య్య‌.

అయితే, కృష్ణ‌య్య గ‌త కొన్నేళ్లుగా రాజ‌కీయాల్లో యాక్టివ్‌ గా పాల్గొన‌డం లేదు. పైగా చంద్ర‌బాబుతో ఆయ‌న ట‌చ్‌ లోనూ ఉండ‌డం లేదు. ఇక‌, టీడీపీ నేత‌లు సైతం కృష్ణ‌య్య‌ను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో సండ్ర‌కే రేవంత్ ప‌ద‌వి ద‌క్క‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేరకు సోమవారం నాటికి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. వాస్త‌వానికి తెలంగాణ అసెంబ్లీలో 2014లో టిడిఎల్పీ నేతగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉండేవారు. దయాకర్‌ రావు శాసనసభపక్ష నేతగా ఉన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ లో చేరారు.

అయితే జిహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా టీడీపీని వీడారు. ఆయన స్థానంలో రేవంత్‌ రెడ్డి టిడిఎల్పీ నేతగా ఎన్నికయ్యారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ పోరాటం సాగించారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులతో రేవంత్ టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఇక టీడీపీకి మిగిలిన ఇద్ద‌రిలో బాబుకు స‌న్నిహితుడుగా ఉన్న సండ్ర‌కే టీడీఎల్పీ నేత ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏదేమైనా సోమ‌వారం నాటికి దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.
Tags:    

Similar News