ఓటుకు నోటు; ఎమ్మెల్యే సండ్ర.. ఇక ఏ5

Update: 2015-07-07 10:04 GMT
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి)ను ఏసీబీ అధికారులు న్యాయస్థానానికి హాజరు పరిచారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణను పూర్తి చేసిన ఏసీబీ.. ఆయన్ను అరెస్ట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే.

ఓటుకు నోటుకు కేసులో ఆయన్ను ఏ5గా చేర్చింది. ఇక.. తమ విచారణలో సండ్ర నోరు విప్పలేదని.. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని.. ఈ నేపథ్యంలో దర్యాప్తు కోసం మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అభ్యర్థించింది. మరోవైపు.. సండ్ర తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. సండ్ర అరెస్ట్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కు కానీ..ఎన్నికల సంఘానికి కానీ సమాచారం ఇవ్వలేదని.. సండ్ర అరెస్ట్‌ సరికాదని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు.. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సండ్ర ఆరోపిస్తున్నారు. అధికారుల విచారణలో భాగంగా తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పానని.. అయినా.. ఫోన్‌ కాల్‌ ఆధారంగా ఈ కేసులో తనను ఇరికిస్తున్నారని.. ఇది అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. ఇప్పటివరకూ సత్తుపల్లి ఎమ్మెల్యేగా తెలిసిన సండ్ర.. తాజాగా ఆయన ఓటుకు నోటు కేసులో ఏ5గా మారారు. ఇక.. సండ్ర ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లిలో.. ఆయన అరెస్ట్‌కు నిరసనగా బంద్‌ పాటిస్తున్నారు.

Tags:    

Similar News