సండ్ర గులాబీ కారెక్కితే బాబుకు భూకంప‌మేనా?

Update: 2018-12-24 06:09 GMT
సంచ‌ల‌న ప‌రిణామాల దిశ‌గా తెలంగాణ రాజ‌కీయాలు ప‌య‌నిస్తున్నాయా? అంటే.. కొంత‌వ‌ర‌కు అవున‌ని చెప్పాలి. ఇప్ప‌టికిప్పుడే కాదు కానీ.. రానున్న రోజుల్లో బాబుకు గ‌డ్డు కాలం త‌ప్ప‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. చేసిన త‌ప్పున‌కు మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న మాట‌ను గులాబీ నేత‌లు ప‌లువురు గుర్తు చేస్తున్నారు.

టీఆర్ఎస్‌ను దెబ్బ తీసేందుకు ఒక‌టికి మూడు సార్లు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేశార‌ని.. ఇక తాము ఆయ‌న్ను ఉపేక్షించేది లేద‌న్న మాట టీఆర్ఎస్ కీల‌క నేత‌ల నోట ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో రావ‌టం గ‌మ‌నార్హం. రాజ‌కీయంగా స‌వాల‌చ్చ ఉండొచ్చు కానీ.. క‌నిపించ‌ని ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే బాబు అలాంటి ప్ర‌య‌త్నాలు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

పోన్లే.. అని ఊరుకుంటే అంత‌కంత‌కూ చెల‌రేగిపోతున్న బాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ భారీ స్కెచ్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీకి రెండు స్థానాల్ని మాత్ర‌మే ద‌క్కించుకోవ‌టం తెలిసిందే. గెలిచిన ఇద్ద‌రిలో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య చాలా కీల‌కంగా చెబుతున్నారు. కేసీఆర్ అండ్ కో ప్ర‌స్తుతం ఆయ‌న‌పై దృష్టి సారించిన‌ట్లు చెబుతున్నారు.

సండ్ర‌ను గులాబీ కారు ఎక్కించేస్తే.. బాబు ఆయువు ప‌ట్టు మీద దెబ్బ తీయొచ్చ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదెలానంటే.. సండ్ర సైకిల్ దిగేసి.. గులాబీ కారు ఎక్కేసిన వెంట‌నే.. ఓటుకు నోటు కేసుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. అప్రూవ‌ర్ గా మారిపోయి జ‌రిగిన దుర్మార్గాన్ని పూస గుచ్చిన‌ట్లుగా చెప్పేయ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. ఏ వ్య‌వ‌స్థ కూడా చంద్ర‌బాబును ర‌క్షించ‌లేద‌ని.. ఆయ‌న‌కు జైలు త‌ప్ప‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ కార‌ణంతోనే సండ్ర చేజారిపోకుండా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. ఈ వ్య‌వ‌హారంలో బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా?  కేసీఆర్ ప్లానింగ్ వ‌ర్క్ వుట్ అవుతుందా? అన్న‌దానికి కాల‌మే స‌రైన స‌మాధానం చెబుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News