ఉయ్యూరులో పారిశుధ్య కార్మికుల వింత నిరసన

Update: 2020-12-24 14:30 GMT
కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో కొన్ని బ్యాంకుల ముందు భారీగా చెత్త పడేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎవరు ఇంత భారీగా చెత్త వేశారు? ఎందుకు వేశారు? బ్యాంకులపై ఏమన్నా కోపమా అన్న సందేహాలు వెల్లువెత్తాయి. ఇక చెత్తకు కంపు కొట్టి స్థానికులు సైతం ఇదేంటని ఆరాతీశారు.

కాగా ఉయ్యూరు పారిశుధ్య కార్మికులే ఇలా బ్యాంకుల ముందు చెత్త వేసినట్టు సమాచారం. చెత్త వేసి తమ నిరసన తెలిపినట్టు ప్రచారం సాగుతోంది.

ఉయ్యూరులోని బ్యాంకులు సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదంటూ పారిశుధ్య కార్మికులతో బ్యాంకు గేట్ల ముందు చెత్త డంపింగ్ చేసి నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్ని బ్యాంకు కార్యాలయాల ముందు లోపలికి వెళ్లనీయకుండా పారిశుధ్య కార్మికులు చెత్తను వేశారు.

ఇలా చెత్తను వెయ్యమని కమిషనరే చెప్పారని కార్మికులు చెబుతున్నట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. పట్టణంలోని అన్ని బ్యాంకు శాఖల ముందు ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా కార్మికులు ఇలా చెత్త వేసి నిరసన తెలిపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఉయ్యూరు పురపాలక కమిషనర్ స్పందించలేదు. చెత్త వేయడానికి గల అసలు కారణాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News