బీఅలెర్ట్‌:టోల్ ఫ్లాజా ద‌గ్గ‌ర 2 కిమీ ట్రాఫిక్ జాం

Update: 2018-01-13 05:10 GMT
అనుకున్న‌దే అయ్యింది. అంచ‌నాలు వ‌మ్ము కానీ వేళ‌.. ఇలాంటి విష‌యాలు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఎందుకు అర్థం కావో? స‌ంక్రాంతి పండ‌గ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ప్రైవేటు వాహ‌నాల్లో ఊళ్ల‌కు త‌ర‌లివెళ్ల‌టం ప్ర‌తిఏటా జ‌రిగేదే. ఇటీవ‌ల కాలంలో ఈ తీరు మ‌రింత పెరిగింది. ఇలాంటి వేళ‌.. వాహ‌నాల వేగాన్ని నియంత్రించేలా.. టోల్ ఫ్లాజా ద‌గ్గ‌ర గంట‌ల కొద్దీ వెయిటింగ్ ఉండే ప‌రిస్థితి.

ప్ర‌త్యేక దినాలు.. ప‌ర్వ‌దినాల‌కు ముందు ఊరు వెళ్లే న‌గ‌ర‌వాసుల కార‌ణంగా కిలోమీట‌ర్ల కొద్దీ ట్రాఫిక్ జాం కావ‌టం మామూలే. టోల్ ఫ్లాజా ద‌గ్గ‌ర టికెట్ తీసుకునేందుకు ప‌ట్టే స‌మ‌యంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితినెల‌కొంటుంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మైన వేళ‌ల్లో ఎలాంటి టోల్ వ‌సూలు చేయ‌కుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. కుద‌ర‌ని ప‌క్షంలో.. మ‌రేదైనా మార్గాన్ని అనుస‌రించాల్సి ఉంటుంది. కానీ. ఇవేమీ చేయ‌కుండా న‌గ‌ర‌వాసుల్ని గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని వృధా చేయ‌టం ఏ మాత్రం స‌రికాదు.

సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో మ‌రోసారి శివారు ప్రాంతాలు ట్రాఫిక్ తో పోటెత్తాయి. హైద‌రాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే రోడ్లు మొత్తం వాహ‌నాల‌తో కిక్కిరిసిపోతున్నాయి. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచి భారీ ఎత్తున వాహ‌నాలు నిలిచిపోతున్నాయి.

శుక్ర‌వారం ఆఫీసులు ముగించుకొని.. రాత్రినిద్ర‌పోయి తెల్ల‌వారుజామునే బ‌య‌లుదేరిన వేలాది మంది న‌గ‌ర‌వాసుల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. చౌటుప్ప‌ల్ మండ‌లం పంతంగి టోల్ ఫ్లాజా వ‌ద్ద భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. త‌క్కువ‌లో త‌క్కువ రెండు కిలోమీట‌ర్ల కంటే ఎక్కువ‌గా వాహ‌నాల‌న్ని నిలిచిపోయాయి. టోల్ ఫ్లాజా దాటేందుకు ఒక్కో వాహ‌నానికి క‌నీసం గంట వ‌ర‌కు ప‌డుతోంద‌ని చెబుతున్నారు.

రైళ్ల‌ల్లో రిజ‌ర్వేష‌న్లు పూర్తి కావ‌టం.. ప్ర‌త్యేక రైళ్లు కిక్కిరిసిపోవ‌టం.. బ‌స్సుల్లో భారీగా ధ‌ర‌లు ఉండ‌టంతో ఎవ‌రికి వారు త‌మ ప్రైవేటు వాహ‌నాల్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు. శుక్ర‌వారం వ‌ర‌కు అన్ని ఆఫీసులు ఉండ‌టంతో.. ఈ రోజు తెల్ల‌వారు జాము నుంచి ప్రైవేటు వాహ‌నాల‌తో బ‌య‌లుదేరే వారు పెరుగుతున్నారు. టోల్ ఫ్లాజా ద‌గ్గ‌ర ట్రాఫిక్ జాం నేప‌థ్యంలో కాసేపు ఆగి బ‌య‌లుదేరితే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అలా కాని ప‌క్షంలో.. టోల్ వ‌సూళ్ల‌ను నిలిపివేస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే.. ట్రాఫిక్ జాం క్లియ‌ర్ అయ్యే వీలు ఉంటుంది.
Tags:    

Similar News