ఇక్కడ కోడి పందేలు స్పెషల్‌.. ఏ గ్రేడ్‌ పాస్‌ రూ.60 వేలు!?

Update: 2023-01-13 07:39 GMT
ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి ఇక తెర లేస్తోంది. పండుగ మూడు రోజులు 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ సందర్భంగా ఈ మూడు రోజుల భారీ ఎత్తున కోడి పందేలు, గుండాటలు నిర్వహించడానికి అప్పుడే ఏర్పాట్లు సిద్ధమైపోయాయని అంటున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా నిర్వాహకులు మాత్రం కోడి పందేలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం కోడి పందేలుకు పెద్ద ఎత్తున సిద్ధమైందని చెబుతున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అంపాపురం, హనుమాన్‌ జంక్షన్, ఉంగుటూరు, బాపులపాడు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల్లో కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధమై పోయాయని పేర్కొంటున్నారు.

అధికారి పార్టీ వైసీపీకి చెందిన కీలక నేతల కనుసన్నల్లో హనుమాన్‌ జంక్షన్‌ లో బరులు రెడీ అయ్యాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క బరికి రెండు ఎకరాలు చొప్పున కేటాయించారని చెబుతున్నారు. ఇప్పటికే పందేలకు హాజరయ్యేవారికి టెక్నాలజీని ఉపయోగించుకుని సోషల్‌ మీడియా ద్వారా, వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా సమాచారం చేరవేశారని అంటున్నారు.

మరోవైపు పోటీలకు హాజరవుతున్న వారిని వీవీఐపీలు, వీఐపీలు ఇలా రకరకాలుగా విభజించి పాసులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇందులోనూ వైఐపీ, ఏ గ్రేడ్‌ వీఐపీ, బీ గ్రేడ్‌ వీఐపీ అంటూ విభజిస్తున్నారని తెలుస్తోంది. ఏ గ్రేడ్‌ పాస్‌ కావాలంటే రూ.60 వేలు చెల్లించాల్సిందేనని పేర్కొంటున్నారు. గ్రేడ్‌ బి పాస్‌ కావాలంటే రూ.40 వేలు, వీఐపీ గ్రేడ్‌ పాస్‌ కావాలంటే రూ.25 వేలు చెల్లించాలని చెబుతున్నారు.

అలాగే కోడిపందేల్లో ప్రధాన బరిలో రూ.5 లక్షలలోపు వరకు పెద్దబరి, మరొక బరిలో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వేరొక బరి ఉన్నాయి. అదేవిధంగా రూ.లక్షలోపు పందేలు కాసేవారికి నాలుగు చిన్న బరులు కూడా సిద్ధం చేశారని టాక్‌.

ఇక పేకాట ఆడేవారి నుంచి ఎంట్రీ ఫీజు కట్టించుకుని వారి చేతికి ట్యాగ్‌ వేస్తారని తెలుస్తోంది. ట్యాగ్‌ ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు కోడిపందేలకు భారీగా హాజరయ్యేవారిని నియంత్రించేందుకు హైదరాబాద్‌ నుంచి 150 మందికిపైగా బౌన్సర్లను కూడా ప్రత్యేకంగా తీసుకువచ్చారని టాక్‌ నడుస్తోంది.

పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే పందెపురాయుళ్ల కోసం విజయవాడ నుండి హనుమాన్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో ఇప్పటికే 1500 గదులను బుక్‌ చేశారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా ఏసీ, నాన్‌ ఏసీ రూమ్‌లను ముందే రిజర్వు చేశారని టాక్‌.

పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారతాయని అంటున్నారు. ఈ క్రమంలో పండుగకు  రెండు రోజుల ముందుగానే పందెం పుంజులను పామాయిల్‌ తోటల్లోకి తరలించారు.

పాసులు తీసుకున్నవారికి అన్ని సదుపాయాలు అందిస్తారని తెలుస్తోంది. ఏసీ హాళ్లలో మంచి రుచికరమైన చికెన్, మటన్‌ బిర్యానీలు, అల్పాహారం కింద 15 రకాల టిఫెన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక భోజనాలకు సైతం ప్రత్యేక మెనూ ఉందని.. వెజ్, నాన్‌ వెజ్‌ ఇలా అన్ని వంటకాలు ఉంటాయని అంటున్నారు.
Tags:    

Similar News