సంక్రాంతి విషాదం.. సింగపూర్ నుంచి సొంతూరుకు వచ్చి యాక్సిడెంట్ లో మృతి

Update: 2021-01-14 04:30 GMT
విన్నంతనే అయ్యో అనిపించే విషాదంగా చెప్పాలి. తెలుగు ప్రజలకు.. అందునా ఏపీ వారికి అతి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. ఈ పండుగ వేళ సొంతూరు వచ్చిన వారిని మృత్యువు వెంటాడింది. ఊహించని రూపంలో వచ్చి పడిన ప్రమాదంలో భార్యభర్తలు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాదం గురించి తెలిసిన వారంతా వేదనకు గురవుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లికి చెందిన జొన్నలగడ్డ రమేశ్ సింగపూర్ లో ఐటీ ఇంజనీర్ పని చేస్తున్నారు. భార్య నీలిమతో కలిసి అక్కడే ఉంటారు. వారి కుమార్తె అశ్విత చెన్నైలోని ఒక హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదువుతోంది. వారం క్రితం రమేశ్.. నీలిమ సింగపూర్ నుంచి చెన్నై చేరుకొని అక్కడే ఉన్న సొంతింట్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. రమేశ్ సోదరుడు శ్రీనివాస్ కొవ్వూరులో నివాసం ఉంటారు.

తల్లికి అనారోగ్యంగా ఉండటంతో కొవ్వూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం కూతురు.. భార్యతో కలిసి రమేశ్ కుటుంబ సభ్యులు ఊరికి బయలుదేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు దగ్గర గుర్తు తెలియని వాహనం వారి కారును ఢీ కొట్టింది. పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారు ఇంజిన్ లో మంటలు వచ్చాయి. కారులో ఎయిర్ బెలూన్సు తెరుచుకున్నా.. రమేశ్.. వెనుక సీటులో కూర్చున్న నీలిమ తీవ్రంగా గాయపడ్డారు.

ముందు సీట్లో తండ్రి పక్కనే ఉన్న అశ్విత ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో అందులో ఉండిపోయింది.ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటల్నిఆర్పి.. కారులో నుంచి బయటకు తీశారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రమేశ్.. నీలిమ ఇద్దరు మరణించినట్లుగా తేల్చారు. ప్రమాదంలో చనిపోయిన తల్లిదండ్రుల్నిచూసిన అశ్విత షాక్ తింది. అమ్మా.. నాన్న అంటూ చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్న వైనం చూసిన వారంతా కంట కన్నీరు వచ్చే పరిస్థితి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రమేశ్ సోదరులు.. బంధువులు ఆసుపత్రికి వచ్చారు. పండక్కి ఊరికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వైనం షాకింగ్ గా మారింది.
Tags:    

Similar News