జగన్ ప్రభుత్వంపై శారదాపీఠం నిరసన!

Update: 2021-09-27 23:30 GMT
''కేసీఆర్‌ మహా మేధావి. మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి. మహాభారతం చదివిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. నా హృదయంలో ఒక ఆత్మగా నేను ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి. విశాఖ శ్రీ శారదాపీఠం ఆయన కోసం ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడింది. జగన్ తనకు ప్రాణమని, కేసీఆర్ కూడా ప్రాణ సమానుడే’’ అని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వరూపానందేంద్రను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ప్రధానంగా తిరుమలలో స్వరూపానందేంద్ర సూచనలతో పలు నిర్ణయాలు తీసుకున్నారని జగన్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు. అయితే ఇంతలోనే ఏమైంది... ఎందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని శారదాపీఠం తప్పుబడుతోంది.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై శారదాపీఠం నిరసన వ్యక్తం చేయాలని భావిస్తోందని చెబుతున్నారు. ఈ విషయంపై సీఎం కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదాపీఠం పేర్కొంది. అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదినలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని శారదాపీఠం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం ప్రకటించింది. అయితే ఇదే అంశంపై బ్రాహ్మణ సంఘాల నేతలు స్వరూపానంద సరస్వతిని కలిశారు. ఈ సందర్భంగా స్వరూపానందకు ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల టీటీడీ బంబో పాలకమండలిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జంబో పాలకమండలిని హైకోర్టు కూడా సస్పెండ్ చేసింది. పాలక మండలి నియామకం వెనుక స్వరూపానందేంద్ర ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రత్యేక జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంపై స్వరూపానందేంద్ర ఎలా స్పందిస్తారో నని అందరూ ఎదురుచూశారు. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ విషయంలో ప్రభుత్వం నిర్ణయంపై శారదాపీఠం నిరసన వ్యక్తం చేయాలని అనుకోవడం గమనార్హం. శ్రీవారి దర్శన టికెట్ల కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత ‘జియోమార్ట్‌’ సబ్‌డొమైన్‌లోకి వెళ్లడంపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ‘టీటీడీ వెబ్‌సైట్‌ని కూడా అంబానీకి అమ్మేశారా?, టీటీడీకి, జియోమార్ట్‌కు సంబంధం ఏంటి? టీటీడీ వెబ్‌సైట్‌ను అంబానీకి కట్టబెట్టిన జగన్‌ ప్రభుత్వం’ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు సంధించారు. మరోవైపు ఈ అంశంపై పలువురు రాజకీయ నేతలు కూడా టీటీడీతో పాటు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇలాంటి తరుణంలో స్వరూపానందేంద్ర, జగన్‌కు అండగా ఉంటారని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా శారదాపీఠం బ్రాహ్మణ కార్పొరేషన్‌ విషయంలో నిరసన వ్యక్తం చేయాలని అనుకోవడం పలు చర్చలకు దారి తీస్తోంది.



Tags:    

Similar News