ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ కు వెన్నుపోటు పొడుస్తార‌ట‌

Update: 2017-06-24 10:11 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఆ పార్టీలోకి కొంద‌రు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా?  త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కేందుకు అవ‌కాశం కోసం చూస్తున్న స‌ద‌రు నాయ‌కుల‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌లు క‌లిసి వచ్చాయా? త‌మ స‌త్తా ఏంటో చాట‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎన్డీఏ అభ్య‌ర్థికి కేసీఆర్ మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు పార్టీ ప‌రంగా నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. అయితే మ‌ద్ద‌తు విష‌యంలో టీఆర్ ఎస్ ర‌థ‌సార‌థి తీరుపై మండిప‌డ్డ స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న విష‌యాల‌ను వెళ్ల‌డించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాయ‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పడ్డార‌ని తాజాగా మీడియాతో మాట్లాడిన స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో ఎందుకు అంత తొందరనో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసే క్రమంలో .. స్పీకర్ గా మీరాకుమార్ పాత్రను కేసీఆర్ ఎలా విస్మరిస్తారని స‌ర్వే ప్ర‌శ్నించారు. ``కేసీఆర్ అన్నా నీకు దండం పెట్టి అడుగుతున్నా .. నీకు ఎందుకు అంత తొందర .. రాష్ట్రపతి అభ్యర్థి మద్దతుపై పునరాలోచించుకో` అని స‌ర్వే ప్ర‌శ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను .. కాంగ్రెస్ ను విస్మరించి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం నమ్మకద్రోహమేన‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అనే ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కు హడావిడిగా వెళ్లిన కేసీఆర్ కు పరాభవమే మిగిలిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మాభిమానం ఎటుపోయిందని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు నమ్మకద్రోహం చేస్తే దేవుడు కూడా కేసీఆర్ ను క్షమించడని, తగిన శాస్తి తప్పదని స‌ర్వే శాప‌నార్థాలు పెట్టారు. కాగా, కేసీఆర్ తీరును ఆయ‌న పార్టీ నేత‌లే త‌ప్పుప‌డుతున్నార‌ని స‌ర్వే అన్నారు.రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ కు ద్రోహం చేయ‌వ‌ద్ద‌నే కోణంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు చెందిన‌ చాలా మంది క్రాస్ ఓటింగ్ లో పాల్గొంటారని స‌ర్వే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ను నిత్యం అవ‌మానిస్తున్న  కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు చాలా మంది రెడీగా ఉన్నార‌ని తెలిపారు.

కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంద‌ని స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. అందుకే మీరాకుమారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశార‌ని అన్నారు. మీరాకుమార్ చాలా సమర్థురాలని, రామ్ నాథ్ కోవిద్ కంటే మీరాకుమార్ రాష్ట్రపతి పదవికి అర్హురాలని స‌ర్వే సూత్రీక‌రించారు. ఈ ఎన్నికలో ఆత్మప్రబోధానుసారం ఓటు వేసుకోవాలని ఎన్డీఏ పిలుపునిస్తే .. మీరాకుమార్ విజయం తధ్యమ‌ని స‌ర్వే ధీమా వ్య‌క్తం చేశారు. మీరాకుమార్ ను బలిపశువు చేశారని బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్ప‌డం స‌రికాద‌ని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమ‌న్నారు. బీహార్ ఆడపడుచు మీరాకుమార్ ను కాదని రాంనాథ్ కోవిద్ కు మద్దతుప్రకటించడం సరికాద‌ని, ఇది పునరాలోచించుకోవాలని కోరారు.  ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా మోడీ మాయ‌లో పడొద్దని అన్నారు. ముస్లిం రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా మాట్లాడిన రామ్ నాథ్ కోవిద్ కు ఎలా మద్దతు ఇస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News