17వ మహిళా సీఎం.. శశికళ

Update: 2017-02-05 20:08 GMT
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత నెచ్చెలి శశికళ ఎన్నికవడంతో దేశంలో మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య మళ్లీ నాలుగుకు చేరనుంది. జయలలిత మృతిచెందేనాటికి దేశంలో నలుగురు మహిళా సీఎంలు ఉండేవారు. జమ్ముకశ్మీర్ కు మెహబూబా ముఫ్తీ, రాజస్థాన్ కు వసుంధర రాజె సింథియా, పశ్చిమబెంగాల్ కు మమత బెనర్జీ ముఖ్యమంత్రులుగా ఉండగా తమిళనాడు జయ సీఎంగా ఉండేవారు. ఆమె మరణంతో మహిళా సీఎంల సంఖ్య మూడుకు తగ్గిపోయింది. జయ తరువాత పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. అయితే.. రెండు నెలల్లో రాజకీయం తారుమారై శశికళ సీఎం కావడంతో మళ్లీ నలుగురు మహిళా సీఎంలవుతున్నారు.

కాగా దేశవ్యాప్తంగా ఇంతవరకు ముఖ్యమంత్రి పీఠమెక్కిన మహిళల లెక్క చూస్తే శశికళ 17వ మహిళా సీఎం అవుతారు. దేశంలో తొలి మహిళా సీఎంగా సుచేత కృపలానీ సుప్రసిద్ధులు. ఆమె 1963లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి అందుకున్నారు. ఆ తరువాత ఒరిస్సాలో 1972లో నందిని శత్పథి సీఎం పదవి చేపట్టారు. వీరిద్దరూ కాంగ్రెస్ నేతలే. ఇప్పటివరకు 13 రాష్ర్టాలకు మహిళలు సీఎంలుగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, గోవా, అస్సాం, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, జమ్ముకశ్మీర్ లకు మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ఇక తమిళనాడు విషయానికొస్తే శశికళ ఆ రాష్ట్రానికి మూడో మహిళా సీఎం. తమిళనాడు అసెంబ్లీ ఏర్పాటును లెక్కలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 8వ వ్యక్తి. శశికళ కంటే ముందు జయలలిత, జయంతి నటరాజన్ లు సీఎంలుగా పనిచేశారు. ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత ఆయన భార్య జానకి నటరాజన్ తమిళనాడుకు తొలి మహిళా సీఎం అయ్యారు. కొద్దికాలమే ఆమె పనిచేయగా ఆ తరువాత జయలలిత పట్టుబిగించి సీఎం కాగలిగారు. సీఎంగా జయ పలుమార్లు పనిచేశారు. ఆమె మృతి తరువాత రెండు నెలల గ్యాప్ తరువాత శశికళ సీఎం అయ్యారు.


Tags:    

Similar News