చిన్నమ్మ ముభావం.. పన్నీర్ ఉత్సాహం

Update: 2017-02-10 04:22 GMT
అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఘట్టం ముగిసింది. తమిళనాడుఅధికారపక్షం అన్నాడీఎంకేలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చేందుకు అవసరమైన పరిణామాలు ఒక కొలిక్కి వచ్చే పరిణామాలు గురువారం వరుసగా చోటు చేసుకున్నాయి. పవర్ కోసం పన్నీర్.. చిన్నమ్మలు పోటాపోటీగా వేసుకుంటున్న ఎత్తులు.. పైఎత్తుల నడుమ.. గవర్నర్ రాక కోసం ఎదురుచూడటం.. గురువారం మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబయి నుంచి చెన్నైకి చేరుకోవటం తెలిసిందే. చెన్నైకి వచ్చిన గవర్నర్ కు అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్ సెల్వం విమానాశ్రయానికి వెళ్లి మరీ ఘనంగా స్వాగతం పలికారు.  ఆ తర్వాత కాసేపటికి రాజ్ భవన్ కు వచ్చిన పన్నీర్.. గవర్నర్ తో భేటీ అయ్యారు. అరగంటకే పైనే వీరిద్దరిమధ్య సమావేశం సాగుతుందని చెప్పినా పావు గంట కంటే తక్కువ సమయంలోనే వీరిద్దరి మధ్య భేటీ ముగియటం.. బయటకు వచ్చిన పన్నీర్ ఉత్సాహంగా కనిపించారు.

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన పన్నీర్.. మీడియాతో మాట్లాడుతూ.. తొందర్లో శుభవార్త వింటారని ఉత్సాహంగా చెప్పటమే కాదు.. నవ్వుతో ఆయన ముఖం వెలిగిపోవటం ఆసక్తికరంగా మారింది. ధర్మమే గెలుస్తుందన్న ఆయన వ్యాఖ్యలకు కారణం.. గవర్నర్ నుంచి ఆయనకు సానుకూల స్పందన లభించటమేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 7.30 గంటలకు రాజ్ భవన్ కు చేరుకున్న శశికళ.. గవర్నర్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య సమావేశం దాదాపు ముప్పావు గంటకు పైగా సాగటం గమనార్హం.

రాజ్ భవన్ కు వెళ్లే ముందు మెరీనా బీచ్ దగ్గరి అమ్మసమాధి వద్ద ప్రార్థనలు జరిపిన చిన్నమ్మ.. గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తనకు మద్దతు ఇస్తున్న 130 మంది ఎమ్మెల్యేల జాబితాను అందించినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ ఎమ్మెల్యే ఎవరి పక్షాన ఉన్నారన్న అంశంపై దాదాపు అరగంట పాటు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

లిస్ట్ ను పరిశీలించినఅనంతరం.. బలపరీక్షకు సిద్ధం కావాలన్న మాటను చిన్నమ్మతో గవర్నర్ చెప్పగా.. ఆమె అందుకు ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. బల నిరూపణ కాకుండా.. ఎమ్మెల్యేల సంతకాల్ని పరిగణలోకి తీసుకొని తనకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆమె కోరినట్లు సమాచారం. దీనికి గవర్నర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ భేటీ అనంతరం బయటకు వచ్చిన చిన్నమ్మ ఒకింత టెన్షన్ గా కనిపించారు. ముభావంగా ఉన్న ఆమె.. పన్నీర్ లో కనిపించిన ఉత్సాహం.. నవ్వు ముఖం లేకపోవటం గమనార్హం. తమతో మాట్లాడాల్సిందిగా చిన్నమ్మను మీడియా ఎంత కోరినప్పటికీ ఆమె స్పందించకుండా మౌనంగా కారులో వెళ్లిపోవటం చూస్తే.. గవర్నర్ సమావేశం చిన్నమ్మ అనుకున్నట్లగా సాగకపోవటమే కారణంగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గవర్నర్ మద్దతు పన్నీర్ కే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News