రిసార్ట్ క‌ళావిహీనం..చిన్న‌మ్మ జైలు కోలాహాలం

Update: 2017-02-19 10:21 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఓ కొలిక్కి వ‌చ్చిన నేప‌థ్యంలో ఇపుడు అంద‌రి దృష్టి గోల్డెన్‌ బే రిసార్ట్స్ పై ప‌డింది. త‌మిళ స‌స్పెన్స్ ప‌రిణామాల్లో ఈ రిసార్ట్స్ గురించి  గురించి వినని వారు ఉండరేమో. ఇటీవల కాలంలో తమిళనాడులోని రాజకీయాలన్నీ ఆ రిసార్ట్‌ చుట్టే తిరిగాయి. దాని సాక్షిగానే ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే గోల్డెన్‌ బే రిసార్ట్‌ ని ఇప్పుడు మూసివేశారు! దాదాపు 12 రోజుల పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న ఈ రిసార్ట్‌ ని నిర్వాహకులు రెండు రోజులపాటు తాత్కాలికంగా మూసివేశారు. బలపరీక్ష కోసం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లిన వెంటనే రిసార్ట్‌ ఎదుట అండర్‌ మెయిన్‌ టెనెన్స్‌ అని బోర్డును తగిలించారు. రిసార్ట్‌ లో మ‌ర‌మ్మ‌తు చేయాలని, అందుకే దీనిని తాత్కాలికంగా మూసివేసినట్లు సిబ్బంది వెల్లడించారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు బావుట ఎగురవేసిన సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ శశికళ రహస్యంగా గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కి తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఎమ్మెల్యేలను ఈ రిసార్ట్‌ లో కలిసిన విషయం తెలిసిందే.

మ‌రోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కారాగార శిక్షకు గురైన శశికళ - ఇళవరసి - సుధాకరన్‌ లు బెంగళూరు నగర శివారులోని పరప్పణ అగ్రహార కారాగారం ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌ల‌తో వెలుగులోకి వ‌చ్చింది. చిన్న‌మ్మ మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను ఇక్కడే అనుభవించనున్న సంగ‌తి తెలిసిందే. ఈ జైలు చ‌రిత్ర భారీగానే ఉందంటున్నారు. బెంగళూరు నగరంలోని ప్రధాన కారాగారాన్ని నగర శివారులోని పరప్పణ అగ్రహారలో ఏర్పాటు చేసిన పెద్ద ప్రాంగణానికి 1997లో తరలించారు. 40 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ కారాగారంలో రెండు వేలమంది ఖైదీలను ఉంచేందుకు నిర్మించారు. అనంతరం ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నాలుగువేల మంది ఖైదీలు వున్నట్టు అంచనా. దీంతో పక్కన ఉన్న 20 ఎకరాలను తీసుకొని విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ జైలుల్లో ఎంద‌రో వీఐపీ ఖైదీలు త‌మ కారాగార వాసాన్ని గ‌డిపారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ మంత్రులు గాలి జనార్దనరెడ్డి, కృష్ణయ్యషెట్టి తదితరులు శిక్షలో భాగంగా ఈ కారాగారంలోనే కొంతకాలం శిక్ష అనుభవించారు. 2014లో జయలలితతో కలిసి శశికళ - ఇళవరసి - సుధాకరన్‌ లు 21 రోజుల పాటు ఖైదీలుగా ఉన్నారు. ప్రధాన కారాగారం కావడంతో 24 గంటలు భారీ భద్రత ఉంటుంది. తమిళనాడుకు కేవలం 30 కి.మీ. దూరంలోనే ఈ కారాగారం వుంది. తమిళనాడులోని హోసూరుకు ఇక్కడకు సమీపంలో ఉంది. ఖైదీలకు అధికారులు నీతిపాఠాలు బోధిస్తారు. జైలు నిబంధనల మేరకు ఖైదీల దినచర్య ఉంటుంది. ఖైదీలు విరామ సమయాల్లో హుల్లికట్టు ఆడుతుంటారు. ఇది చదరంగం ఆటను పోలివుంటుంది. కరడుగట్టిన ఖైదీలు - జీవిత శిక్షకు గురైనవారు, మాదకద్రవ్యాల రవాణాలో శిక్ష పడ్డవారు జైలులో ఎక్కువగా ఉన్నారు. పురుష - మహిళా ఖైదీలకు వేర్వేరు ప్రాంగణాలున్నాయి. విచారణలో ఉన్న ఖైదీలు కూడా ఎక్కువగా ఉండటం విశేషం. వేలాదిమంది ఖైదీలు ఉండటంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు వస్తుండటంతో జైలు ప్రాంగణం సందడిగా ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News