ఆమె భర్త వద్దకెళ్లాలన్నా షరతులే!

Update: 2017-10-06 04:12 GMT
తమిళనాడులో చిన్నమ్మ శశికళ పెరోల్ కు మార్గం సుగమం అయింది. తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని, ఈ సమయంలో ఆయన సమక్షంలో తాను ఉండాలని కోరుకుంటూ పెరోల్ కోసం కర్నాటక పరప్పన జైలులో ఉన్న శశికళ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీనిపై విచారణ సాగుతోంది. ఈ విషయంలో ఆమెకు పెరోల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్నాటక లోని సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో న్యాయస్థానం ఉత్తర్వులు రావడం ఒక్కటే తరువాయి. అయితే శశికళకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఆ రకంగా తన భర్తకు వద్దకు వెళ్లాలని విజ్ఞప్తి చేసుకుంటున్నప్పటికీ... శశికళకు అనేక షరతులు విధించి మాత్రమే అక్కడకు పంపుతారనే ప్రచారమూ జరుగుతోంది. అదే సమయంలో ఒకసారి శశికళ జైలునుంచి బయటకు రావడం అంటూ జరిగితే.. తమిళనాట అన్నా డీఎంకే రాజకీయాలను అల్లకల్లోలంగా మార్చగలదనే భయాలు కూడా వ్యాపిస్తున్నాయి. ఆమెను, ఆమె బంధువు దినకరన్ ను పార్టీనుంచి వెలేసిన పళనిస్వామి - పన్నీర్ సెల్వంలకు ఈ పెరోల్ అనేది పీడకల కావచ్చు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు దినకరన్ వర్గంలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి మీద అనర్హత వేటు వేసి.. పళని ప్రభుత్వం సేఫ్ పొజిషన్ కు చేరుకుంది. ఈ సమయంలో శశికళ బయటకు వస్తే పార్టీలోని ఇంకా ఎందరు ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రలోభాలు పెడుతుందో.. లేదా, ఎలాంటి ఒత్తిళ్లు వారి మీద తెస్తుందో అనూహ్యం. ఆమె మాయోపాయాలకు ఎందరు మెత్తబడి.. ఆమె కోటరీలోకి చేరుతారో కూడా చెప్పలేని సంగతి.

ఈ నేపథ్యంలో శశికళ మంత్రాంగం నెరపకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వ్యూహరచనలో పళనిస్వామి వర్గం ఉంది. ఆమె జైలునుంచి బయటకు వచ్చినా, ఆస్పత్రిలో భర్త పక్కన ఉన్నా.. ఆమె వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా.. ఆమెను ఎవ్వరూ కలిసే అవకాశం లేకుండా.. తమ అధికారం ఉపయోగించి ఎలాంటి చర్యలు చేయవచ్చో, శాంతి భద్రతల పేరుతో ఎలాంటి ఆంక్షలు విధించవచ్చో వారు ప్లాన్ చేస్తున్నారు. నిర్దిష్టంగా భర్త అనారోగ్యం పేరుతో పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అసలే న్యాయస్థానం కూడా  అనేక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆస్పత్రి తప్ప మరో చోటకు వెళ్లకుండా ఆంక్షలు ఉన్నాసరే.. తాను చేయదలచుకున్న వ్యవహారాలు మొత్తం ఆస్పత్రినుంచే నడపగల చాతుర్యం చిన్నమ్మకు ఉన్నట్లే. మరి అక్కడి పరిస్థితులను పళని ప్రభుత్వం ఎలా మేనేజి చేస్తుంది? ఎలా నెగ్గుకు వస్తుంది? తమ సేఫ్టీని ఎలా కాపాడుకుంటుంది అనేది చూడాలి.
Tags:    

Similar News