అమ్మ ద‌ళం.. బానిసుల గుంపు

Update: 2016-08-11 08:07 GMT
దేశంలో చాలా త‌క్కువ రాష్ట్రాల్లో మాత్ర‌మే ఉండే వ్య‌క్తిపూజ త‌మిళ‌నాడులో పీక్స్ లో ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇక‌.. అన్నాడీఎంకే అధినేత్రి.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత విష‌యంలో ఈ ఆరాధ‌న మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అమ్మ‌ను వేలెత్తి చూపించ‌టం త‌ర్వాత‌.. ప‌ల్లెత్తు మాట అనేందుకు ఆమె పార్టీకి చెందిన నేత‌లు ఎవ‌రూ సాహ‌సించ‌రు. అలాంటి వేళ‌.. ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు శ‌శిక‌ళ పుష్ప తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. జ‌య‌ల‌లిత త‌న‌ను ఆమె ఇంట్లో కుక్క‌ను బంధించిన‌ట్లుగా బంధించారంటూ రాజ్య‌స‌భ‌లోనే తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

అధినేత్రిపై శ‌శిక‌ళ అంతేసి మాట‌లు ఎందుక‌న్నార‌న్న విష‌యంలోకి వెళితే.. డీఎంకే పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడిపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో చేయి చేసుకోవ‌టం.. వారి మ‌ధ్య‌నున్న స్నేహంపై వ‌స్తున్న వార్త‌ల‌తో ఒళ్లుమండిన అమ్మ‌.. ఆమెను రాజీనామా చేయాల‌ని ఆదేశించారు. ప‌ద‌వి పోతే త‌న ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిన శ‌శిక‌ళ‌.. అమ్మ మాట‌కు నో చెప్ప‌ట‌మే కాదు.. త‌న‌ను రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఏ ల‌క్ష‌ణ గీత అయితే దాట కూడ‌దో అది కాస్తా దాటేశారు.

దీంతో.. అమ్మ ఆగ్ర‌హం ఓ రేంజ్‌కు వెళ్ల‌ట‌మేకాదు.. శ‌శిక‌ళ పుష్ప‌ను పార్టీ నుంచి త‌ప్పిస్తూనిర్ణ‌యం తీసుకున్నారు. అమ్మ ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నారేమో కానీ.. పార్టీ నేత‌లు ప‌లువురు శ‌శిక‌ళ పుష్ప‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ పోలీసుల‌కు ఫిర్యాదులు చేయ‌టం మొద‌లుపెట్టారు. కేసుల మీద కేసులు మీద ప‌డుతున్న వేళ‌.. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ‌శిక‌ళ అమ్మ మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న‌పార్టీని ఆమె బానిస‌ల గుంపుగా అభివ‌ర్ణిస్తూ.. అధినేత్రిపై తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు.

బానిస‌ల గుంపులో తాను భాగ‌స్వామ్యం కావాల‌ని తాను అనుకోవ‌టం లేద‌న్న ఆమె.. త‌న‌ను వేధిస్తే.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాడార్ వ‌ర్గం త‌న‌కుఅండ‌గా నిలుస్తుందంటూ ఆమె కుల రాజ‌కీయానికి తెర తీశారు. త‌మిళ‌నాడు ద‌క్షిణ జిల్లాల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల్లో ఒక‌టైన నాడార్ కులాన్ని తెర మీద‌కుతీసుకురావ‌టం ద్వారా అమ్మ ఆగ్ర‌హానికి అడ్డుక‌ట్ట వేయాల‌ని చూస్తున్న‌ట్లుగా ఉంది. ఇదిలా ఉంటే.. గ‌తంలో శ‌శిక‌ళ ఇంట్లో ప‌ని చేస్తున్న ఏడుగురు వివిధ కార‌ణాల‌తో మ‌ర‌ణించిన అంశంపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్ట‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. అమ్మ మీద ప‌ల్లెత్తు మాట అన‌టానికి జంకే ప‌రిస్థితికి భిన్నంగా బ‌ల‌మైన గొంతు ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు..అమ్మ మీద పోరాటం చేయాల‌న్న ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్న శ‌శిక‌ళ ఎపిసోడ్ ఏ ద‌రికి చేరుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News