14ఏళ్ల‌లో చిన్న‌మ్మ సంపాద‌న‌ 20 వేల కోట్లు!

Update: 2017-03-07 10:07 GMT
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు సంబంధించిన ఒక్కొక్క సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలిగా ఉంటూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ముందే తెలుసుకొని త‌న సొంత లాభానికి మెట్టుగా మ‌లుచుకునే వార‌నే ఆరోప‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి ఉదంతంలోనే తాజాగా అనూహ్య వార్త ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏకంగా రూ.20వేల కోట్ల లావాదేవీలు డీల్‌ ను చిన్న‌మ్మ సార‌థ్యంలోని సంస్థ నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. శ‌శిక‌ళ‌ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న మిడాన్ సంస్థ రాష్ట్రప్రభుత్వానికి 14 ఏళ్ళలో రూ.20 వేల కోట్ల మద్యపానీయాలను విక్రయించి రికార్డు సృష్టించినట్లు తాజాగా వెలుగుచూసింది.

2001 నుంచి 2006 వరకు కొనసాగిన అన్నా డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని నిర్ణయం తీసుకుంది.  2003 లో ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయాన్ని తీసుకునే కొన్ని నెలల ముందు 2002 అక్టోబర్ 28న మిడాన్ గోల్డెన్ డిస్టిల‌రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మద్యపానీయాల ఉత్పత్తిని కాంచీపురం జిల్లా పడప్పై ప్రాంతంలో ప్రారంభించారు.  2004 లో శశికళ బంధువులు భాగస్వాములుగా చేరారు. అనంతరం టాస్మాక్ సంస్ధ ఆధీనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం చిల్లర దుకాణాలకు అవసరమైన మద్య పానీయాలను పూర్తిస్థాయిలో సరఫరా చేసే స్థాయికి మిడాన్ సంస్థ ఎదిగింది.  ఏడాది కేడాది ఈ సంస్థ వ్యాపారం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఇలా 20,000 వేల కోట్ల రూపాయ‌ల మేర జ‌రిపిన వ్యాపారంలో చిన్న‌మ్మ బాగానే కూడ‌బెట్టుకుంద‌నే టాక్ ఉంది.

అయితే 2006 లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో అధికారం చేపట్టిన డీఎంకే ప్రభుత్వం ప్రభుత్వ ప‌రిధిలో ఉన్న ట్రాస్మాక్  దుకాణాలను చిన్న‌మ్మ వెన‌క ఉండి న‌డిపించి మిడాన్ సంస్థల నుంచి కొనుగోలు చేసే మద్యపానీయాలను నిలిపి వేసింది. దీంతో ఖంగు తిన్న శ‌శిక‌ళ వ‌ర్గం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ వాద‌నే నెగ్గింది. అయితే తాజాగా  ఈ వార్త మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చి చిన్న‌మ్మ లీలల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జెప్పింది.
Tags:    

Similar News