ఎప్పుడంటే అప్పుడే చిన్నమ్మ సీఎం

Update: 2017-01-10 05:15 GMT
అంచనాలు నిజమవుతున్నాయి. ఊహాగానాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. విధేయుడి చేతిలో ఉన్న అధికార పగ్గాల్ని తీసేసుకునేందుకు చిన్నమ్మ సిద్ధం అవుతున్నారు. ఇందుకు డేట్ కూడా డిసైడ్ చేసినట్లేనని తెలుస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి చిన్నమ్మ తహతహలాడుతున్న వైనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

పార్టీ సంప్రదాయం ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించే వారే.. సీఎం కుర్చీలో కూర్చోవాలి. ఆ లెక్కన చిన్నమ్మే సీఎం అని వేరుగా చెప్పాల్సిన అవసరం లేనట్లే. ఇంతకాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న అన్నాడీఎంకే నేతల మాటలకు మరో ఎంపీ తన మద్దతు ఇవ్వటమే కాదు.. సీఎం పదవిని ఎప్పుడు చేపడతారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి.

పార్టీ ఎంపీ కమ్ అధికార ప్రతినిధి అయిన మైత్రేయన్ ఒక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నమ్మ సీఎం కావటానికి తాము ఎవ్వరం అడ్డు చెప్పమని.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టటం అంతా ఆమె ఇష్టంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్న విషయం ఒక అధికారి వెల్లడించారు కదా? అన్న ప్రశ్నకు అవునని చెప్పారు.

ఇదిలా ఉండగా.. చిన్నమ్మ సీఎం కుర్చీలో కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు. తమిళులకు ఎంతో ఇష్టమైన పొంగల్ కు కాస్తంత ముందు కానీ.. లేదంటే పొంగల్ పండగ తర్వాత కానీ సీఎం పగ్గాలు చేపడతారని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల అంచనాల ప్రకారం ఈ నెల 12 నుంచి 18 మధ్యలోనే చిన్నమ్మ సీఎం బాధ్యతల్ని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. రానున్న వారం వ్యవధిలో తమిళ రాజకీయాల్లో కీలకమార్పు చోటు చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మ బతికి ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలే తప్పించి.. ప్రభుత్వం వ్యవహారాల వైపు కన్నెత్తి చూడని చిన్నమ్మ.. ఆమె లేని వేళ.. ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News