తెలుగు రాష్ట్రాలకు గవర్నర్.. మాజీ సీజే..?

Update: 2015-09-08 05:01 GMT
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా వచ్చిన నరసింహన్.. రాష్ట్ర విభజన తర్వాత.. మోడీ సర్కారులోనూ ప్రధమ పౌరుడిగా కొనసాగుతున్న వైనం తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఆయన్ను తప్పించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో నిజం లేదంటూ చెబుతున్న గవర్నర్.. ఆ మధ్య ఆగస్టు 15న మాత్రం అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి నిరాశాపూరిత వ్యాఖ్యలు వినిపించటం తెలిసిందే.

అప్పటి నుంచి గవర్నర్ మార్పుపై పలు కథనాలు వచ్చినా.. ఆయన్ను మాత్రం మార్చలేదు. మోడీతో గవర్నర్ నరసింహన్ కు ఉన్న ‘అనుబంధమే’ దీనికి కారణంగా చెప్పేవారు చాలామందే ఉన్నారు. అయితే.. తాజాగా నరసింహన్ తనకు తానుగా పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. విభజన తర్వాత.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన కొత్తల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చక్కటి సంబంధాలున్న ఆయన.. ఆ తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుకూలమన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఏపీకి సంబంధించిన అంశాల విషయంలో.. తెలంగాణ సర్కారును ఆదేశించటంలో ఆయన పెద్ద ఆసక్తి చూపించటం లేదన్న ఏపీ మంత్రుల మాట.. వారి మధ్య పెరిగిన దూరాన్ని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే..ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో ఏపీ సర్కారుకు.. గవర్నర్ కు మధ్య దూరం మరింత పెరిగింది. అనంతరం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ గవర్నర్ కు కాస్తంత దూరం వచ్చినట్లే చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని గవర్నర్ తప్పుపట్టటం.. ఆయన తీరుపై కేంద్రానికి ఇచ్చిన నివేదికతో ఇద్దరు ముఖ్యమంత్రులతో గవర్నర్ కు లొల్లి షురూ అయినట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టటం గమనార్హం. కొద్ది కాలంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఎవరో ఒకరు గవర్నర్ నిర్వహించే కార్యక్రమాలకు డుమ్మా కొట్టటం మామూలే అయినా.. ఇద్దరూ కలిసి రాకుండా ఉండటం ఇదే తొలిసారి. దీంతో.. తనకు తానుగా గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలని గవర్నర్ యోచిస్తున్నట్లుగా వాదన వినిపిస్తోంది.

పదవి నుంచి తప్పుకునే విషయంలో గవర్నర్ ముందుకు రావటంతో కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న సంక్లిష్టత నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున న్యాయపరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో.. ఈ వివాదాల పరిష్కారంతో పాటు.. వాటి పరిష్కారానికి న్యాయనిపుణుడైన వ్యక్తిని గవర్నర్ గా ఎంపిక చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరు బలంగా వినిపిస్తోంది. కేరళ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా సరిపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆయన పేరు అధికారికంగా ప్రకటేంచే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News