కిరణ్ బేడీ.. తమిళ సై లాంటోళ్లు తెలీదా సత్యపాల్ మాలిక్

Update: 2019-10-23 05:20 GMT
పదవి ఏదైనా సరే.. దానికి ఉండే అధికారం అంతో ఇంతో ఉంటుంది. కొన్ని పదవులు అలంకార ప్రాయంగా ఉన్నప్పటికీ.. చట్టప్రకారం తనకుండే అధికారాలు ఏమిటన్న విషయాన్ని సదరు స్థానంలో కూర్చున్న వ్యక్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకే పదవిలో ఉన్నా.. కొందరు చెలరేగిపోతే.. మరికొందరు మాత్రం తమకున్న పరిమితుల గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటారే కానీ.. ఉన్న పరిమితుల్లోని మినహాయింపులు.. ఏం చేయగలనన్న విషయం మీద క్లారిటీ ఉంటే.. ఏ పదవి చిన్నది కాదు.

ఇప్పుడు చెప్పేది చిన్నా చితకా పదవి గురించి కాదు. ఏకంగా గవర్నర్ పదవి గురించే. ఎవరైనా గవర్నర్ పదవి గురించి ఎంత గొప్పగా భావిస్తారు. కానీ.. జమ్ముకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం మరీ తీసి పారేసినట్లు మాట్లాడం ఆసక్తికరంగా మారింది.
గవర్నర్ కు అధికారాలు ఏమీ ఉండవని.. చివరకు ప్రెస్ మీట్ పెట్టేందుకు అనుమతి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా.. గవర్నర్ హోదాలో ఉన్న వారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? చెప్పాల్సిన విధంగా చెబితే.. విషయం ఎవరికి ఎలా చేరవేయాలో అలా మీడియా చేరవేస్తుంది. దానికి అంతలా వేదన చెందాల్సిన అవసరమే లేదు.

గవర్నర్ స్థానంలో ఉన్న వారు తమ మనసులోని మాటను చెప్పేందుకు అవకాశం లేదని వేదన చెందే సత్య మాలిక్.. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లుగా వ్యవహరిస్తున్న వారు నడిపిస్తున్న హవా గురించి తెలీదా? అన్న డౌట్ ఆయన మాటలు వింటే కలుగక మానదు. ఎక్కడిదాకానో ఎందుకు? చిన్న కేంద్రపాలిక ప్రాంతమైన పాండిచ్చేరికి లెఫ్టెనెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న కిరణ్ బేడీ పాలక పక్షానికి ఎంతలా చుక్కలు చూపిస్తారో తెలియంది కాదు.

అంతవరకూ ఎందుకు.. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన తమిళ సై సంగతే చూడండి.. ఆమె కారణంగా మాస్టర్ మైండ్ కేసీఆర్ సైతం కాస్త తడబాటుకు గురి అవుతున్నట్లు చెబుతారు. చేతిలో ఉన్న అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన పూర్తిగా లేనప్పుడు మాత్రమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని సత్యమాలిక్ లాంటోళ్లను చూస్తే అర్థం కాక మానదు. అయినా.. ప్రెస్ మీట్ పెట్టేందుకు అనుమతి లేకుంటే మాత్రం గవర్నర్ పదవి బలహీనమైనది ఎందుకవుతుంది సత్యపాల్ మాలిక్ జీ? మరీ.. గవర్నర్ పదవి ఇజ్జత్ తీసేలా ఇలాంటి మాటలే మాత్రం బాగోలేదు సాబ్.
Tags:    

Similar News