ఈ వైర‌ల్ వాట్సాప్ మెసేజ్ చూశారా కేసీఆర్‌?

Update: 2018-08-31 06:30 GMT
రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సినీ న‌టుడు క‌మ్ రాజ‌కీయ నేత హ‌రికృష్ణకు ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న స్మార‌కాన్ని నిర్మిస్తామంటూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణంపై కేసీఆర్ స‌ర్కారు స్పందించిన తీరుపై సోష‌ల్ మీడియాలో గ‌డిచిన రెండు రోజులుగా వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌కు. జ‌రుగుతున్న నెగిటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. ఇదంతా కూడా తెలంగాణ‌లోని సీమాంధ్ర ఓట‌ర్ల మ‌న‌సు దోచుకోవ‌టానికే అన్న వాద‌న‌ను ప‌లువురు వినిపిస్తున్నారు.
ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాల అనంత‌రం.. హ‌రికృష్ణ స్మార‌కాన్ని నిర్మించ‌టం ఏమిటంటూ.. వాట్సాప్ లో ఒక మేసేజ్ వైర‌ల్ అవుతోంది. దాన్ని య‌థాత‌ధంగా చూస్తే..

గూడ అంజన్న చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు కేసీఆర్ కుటుంభం....

తొలి తరం తెలంగాణ ఉద్యమ కారుడు ప్రో.కేశవరావు జాదవ్ గారు మరణిస్తే కనీసం  పరామర్శించకపోతివి.

నీకు ఉద్యమంలో ఒడిదోడుకులు ఎదురైనపుడు జలదృశ్యం లో ఆశ్రయం ఇచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోయినపుడు  కనీసం పరామర్శించక పోతివి.

1200 మంది తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి సమయం ఉండదు.
తప్పుడు లెక్కలతో 400 మందికే పరిహారం ఇస్తివి.

రామానాయుడు - హరికృష్ణ చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు?

నిర్లక్ష్యంగా నిబంధనలు పాటించకుండా కనీసం సీట్ బెల్ట్ పెట్టుకోకుండా  120.కి.మీ వేగం తో బండి నడిపి చనిపోయిన వ్యక్తికి - నరనరాన‌ తెలంగాణ ని వ్యతిరేకించి - చివరికి సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసినా వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలా??

సామాన్య ప్రజల్ని - విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేసి విద్య ని వ్యాపారమయం చేసిన సీమాంధ్ర కార్పొరేట్ కాలేజి అధినేత కొడుకు  అతి వేగం తో డివైడర్ కి గుద్దుకొని చస్తే ప్రభుత్వం లో ముఖ్య స్తానం లో ఉన్న మంత్రి అన్ని దగ్గరుండి చూసుకొని శవాన్ని పంపిస్తారు.

ఎవరికోసం తెలంగాణ తెచ్చుకుంది దొరా...??? ఇదేనా బంగారు తెలంగాణ?? అంటూ ఒక మేసేజ్ వైర‌ల్ అవుతోంది. ఇది భారీగా స‌ర్క్యులేట్ కావ‌ట‌మే కాదు.. మ‌రిన్ని ప్ర‌శ్న‌ల్ని చ‌ర్చ‌కు తెచ్చింది. లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌ర‌ణించిన‌ప్పుడు క‌నీసం ఆయ‌నకు నివాళులు అర్పించేందుకు సైతం కేసీఆర్ రాలేద‌ని గుర్తు చేస్తున్నారు. హైద‌రాబాద్ కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వ‌చ్చిందంటే కార‌ణం అక్కినేని. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా హైద‌రాబాద్ లో అప్ప‌ట్లోనే స్టూడియో క‌ట్టే ధైర్యం చేయ‌టం ద్వారా  టాలీవుడ్ హైద‌రాబాద్ కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రి.. అలాంటి ఆయ‌న్ను ప‌రామ‌ర్శించ‌లేదు.

అక్కినేని సీమాంధ్రుడు అనుకుంటే.. తెలంగాణకు నిలువెత్తు రూపం లాంటి దాశ‌ర‌ధి రంగాచార్యుల వారు తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోతే ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు సైతం కేసీఆర్ కు స‌మ‌యం దొర‌క‌లేద‌న్న విష‌యాన్ని ప‌లువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. హైద‌రాబాద్ లోని సీమాంధ్రుల‌ను క‌డుపులో పెట్టుకొని చూస్తాన‌ని.. వారి కాలికి ముల్లు గుచ్చుకుంటే త‌న నోటితో తీస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. తాజాగా హ‌రికృష్ణ మీద అంత భారీగా అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌టానికి కార‌ణం త్వ‌ర‌లో జ‌రిగే ముంద‌స్తు ఎన్నిక‌ల్లో  సీమాంధ్రుల ఓట్ల‌ను కొల్ల‌గొట్ట‌టానికా?  అన్న ప్ర‌శ్నను సంధిస్తున్నారు.

సీమాంధ్రుల మ‌న‌సుల్ని దోచుకునే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు?  అంత ధైర్యం కేసీఆర్ ఎందుకు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌ను కొంద‌రు వేస్తుంటే.. తెలంగాణవారిని క‌న్వీన్స్ చేసే స‌త్తా త‌న‌లో ఉంద‌న్న ఉద్దేశ‌మే కేసీఆర్ ఇలా చేయ‌టానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఇదిలాఉంటే.. హ‌రికృష్ణకు స్మార‌కం నిర్మించాల‌న్న కేసీఆర్ నిర్ణ‌యంపై ప‌లువురు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతూ.. సార్.. ప్లీజ్ కాళేశ్వ‌రం పేరు మాత్రం మార్చొద్దంటూ చేస్తున్న వ్యాఖ్య‌ల్ని.. సోష‌ల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ వైర‌ల్ అవుతున్న మెసేజ్ లు కేసీఆర్ దృష్టికి వెళుతున్నాయా? 
Tags:    

Similar News