ఆయన చేతల మనిషి...అరుదైన ప్రధాని
సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే అతి ముఖ్య లక్షణం ఏంటి అంటే ధారాళంగా మాట్లాడడం.
సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే అతి ముఖ్య లక్షణం ఏంటి అంటే ధారాళంగా మాట్లాడడం. ప్రసంగాలతో జనాలను ముంచేయడం. నాయకులను సైతం ఆకట్టుకోవడం. ఇలా ఉంటుంది ఒక సగటు రాజకీయ నేత వ్యవహార శైలి. కానీ దివంగతులైన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అలాంటి వారు కాదు. ఆ మాటకు వస్తే ఆయన రాజకీయ నేత కంటే రాజకీయ మేధావి గానే కనిపిస్తారు. ఆయనకు ఉన్న విద్యా పాండిత్యం. ఆర్థిక అంశాల మీద ఉన్న బలమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక అరుదైన ప్రధాని గానే దేశానికి పరిచయం చేస్తాయి.
ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. అవి ఆయన వ్యాపకంగా కూడా లేదు. సుమారు ఆరు పదుల వయసులో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారూ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న ఆయనలోని ప్రతిభను గురించి రాజకీయ రంగంలోకి తీసుకుని వచ్చిన వారు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు.
అప్పటికి దేశం ఆర్ధికంగా ఎంతో అవస్థ పడుతోంది. పీవీకి ముందు ప్రధానిగా చేసిన చంద్రశేఖర్ బంగారాన్ని కుదువ పెట్టి పాలన చేశారు. పీవీకి ఆ ఆర్థిక దుస్థితి వారసత్వంగా దక్కింది. దాంతో పీవీ చేసిన తెలివైన ఆలోచన ఏంటి అంటే ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ని తీసుకోవడం.
అలా పీవీ మన్మోహన్ సింగ్ కి రాజకీయ గురువుగా ఉన్నారు. పీవీ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువగానే తన పనితీరుతో చూపిస్తూ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా విశేషంగా రాణించారు. ఆయన 1991 నుంచి 1996 దాకా అయిదు బడ్జెట్లను ఆర్ధిక మంత్రిగా ప్రవేశపెట్టారు.
ఈ దేశానికి సరళీకృత ఆర్థిక విధానాలను పరిచయం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి మార్గం వేశారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ పరుగులు తీయడానికి కారణం అయ్యారు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉండగా దేశం జీడీపీ 10.5 శాతం నమోదు చేసుకుంది. ఇది ఆల్ టైం రికార్డుగా కూడా ఉంది.
అలా ఆయన దేశ ఆర్ధిక రధాన్ని పరుగులెత్తించారు. పీవీ రాజకీయ వ్యూహాలకు మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యూహాలు జత కలసి ఒక అపూర్వమైన కాంబినేషన్ ని 1991 నుంచి 1996 దాకా అంతా చూశారు. ఆ తరువాత ఆయన తిరిగి 2004లో అంటే 72 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని అయ్యారు.
ఇది కూడా అనూహ్యమే. దేశానికి ప్రధాని ఎవరు అన్నది చర్చకు వచ్చినపుడు కాంగ్రెస్ లో ఎన్నో పేర్లు వినిపించాయి. ఆనాడు దిగ్గజ నేతలు ఎందరో ప్రధాని రేసులో ఉన్నారు. కానీ సోనియా గాంధీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుని ప్రతిపాదించారు. అలా ఆయన ప్రధానిగా దేశానికి సేవ చేసే అవకాశం లభించింది.
ఆయన మాటలు తక్కువగా మాట్లాడుతారు. ఒక దేశ ప్రధాని నుంచి ప్రసంగాలను పూర్తి స్థాయిలో వినాలనుకునే వారు బహుశా మన్మోహన్ సింగ్ విషయంలో నిరాశ చెందినా ఆయన పనితీరుతో మాత్రం వారంతా పూర్తి సంతృప్తితో ఉన్నారు అన్నది ఆయన పదేళ్ల ప్రధాని బాధ్యతలతో రుజువు అయింది.
ఆయన దేశానికి ఏమి చేశారు అన్నది ఒక ప్రశ్నగా వేసుకుంటే ఎంతో చేశారు అని జవాబుగా వస్తుంది. ఈ రోజున దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయిదవ ప్లేస్ లో ఉంది. తొందరలో మూడవ ప్లేస్ లోకి వస్తోంది. దానికి కారణం మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో పరచిన రాచబాటనే కారణం అని చెప్పాల్సి ఉంటుంది.
ఆయన నిరంతరం పనిచేసేవారు. ఆయన మాటలు మాత్రం పెద్దగా ఉండేవి కావు. ఆయన మాట్లాడితే ఆణిముత్యాలు రాలినట్లే అని అనేవారు. అంటే అంత తక్కువగా సంభాషించేవారు. అది బహిరంగ సభ అయినా కాంగ్రెస్ వేదికగా జరిగే పార్టీ మీటింగ్ అయినా లేక కేబినెట్ సమావేశం అయినా అధికారుల భేటీ అయినా క్లుప్తంగా ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మాట్లాడడం మన్మోహన్ సింగ్ స్పెషాలిటీ.
అందుకే ఆయనకు మౌన ముని అని పేరు. ఆయన పార్లమెంట్ లో ఇచ్చిన జవాబు కూడా మృదువుగా ఉండేది. ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద వ్యంగ్య విమర్శలు చేసేవారు కాదు. వివాద రహితునిగా ఆయన ఉన్నారు. ఆయన రాజకీయాలలో తన వంతు పాత్ర వహించారు. దేశానికి ఏమి చేయాలో అది చేశారు. తన వంతు మేధో సంపత్తిని అంతా ఉపయోగించారు.
ఈ రోజున దేశం ఇలా ఆర్ధికంగా ముందుకు సాగుతోంది అంటే అది తన ఘనత అని చెప్పుకోలేదు. తాను విధిని నిర్వహించాను అని ఒక నిష్కామ యోగిలానే వ్యవహరించారు. చివరికి ఆయన మౌనంగానే ఈ లోకం నుంచి నిష్క్రమించారు. మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశ ప్రజలను శోక సంద్రంలో ముంచెత్తింది. ఆయన అద్భుత ప్రసంగీకుడు కాకపోయినా తన పనితీరుతో తన మౌన భాషతో ఈ దేశంలోని కోట్లాదిమందికి కనెక్ట్ అయ్యారు అనడానికి ఆయన మృతి వార్త విన్న వారు అంతా కన్నీరు పెట్టడమే ఒక సాక్ష్యంగా చూడాలి.