అభ్య‌ర్థులు దొర‌క‌ని పార్టీకి అధికారం కావాల‌ట‌!

Update: 2018-10-24 17:30 GMT
తెలంగాణ బీజేపీలో ఇప్పుడు హాట్ హాట్ ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ఓవైపు, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా వ‌రుస టూర్లు... ప‌రిపూర్ణానందకు అనూహ్య‌రీతిలో కండువా క‌ప్ప‌డం ద్వారా కొత్త హీట్‌ కు తెర‌తీసిన బీజేపీ మ‌రోవైపు తెలంగాణ‌లో అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ త‌ర్వాత అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన రెండో పార్టీగా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అయితే, ఇవ‌న్నీ బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఆ పార్టీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌కు ఆచ‌ర‌ణకు పొంత‌న లేదంటున్నారు.

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగేందుకు సిద్ధ‌మైన ఇటీవల బీజేపీ 38 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాపై పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి పెల్లుబుకింది. ఏ ప్రాతిప‌దిక‌న ఈ నేత‌ల‌కు టికెట్లు ఇచ్చారంటూ కొంద‌రు భ‌గ్గుమ‌న్నారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోని 38 మందిలో 20 బీజేపీలో కొత్తగా చేరిన వారేన‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 46 స్థానాల్లో దాదాపు 20 సీట్లను కొత్తవారికే ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడానికే.. పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తూ పోతే...దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న తామేం కావాలంటూ కొంత మంది నేతలు నిరసనలకు దిగారు. నిర్మ‌ల్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారైతే...ఏకంగా రాష్ట్ర కార్యాల‌యం ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద బైఠాయించి త‌మ‌కు న్యాయం చేయ‌క‌పోతే ఇక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని ఆందోళ‌న చేశారు. దీంతో వారికి స‌ర్దిచెప్పేందుకు పార్టీ కార్యాల‌యంలో ఉన్న నాయ‌కుల వ‌ల్ల కాలేక‌పోయిందని అంటున్నారు.

బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో సాయంత్రం పార్టీలో చేరిన వ్యక్తికి రాత్రి టికెట్ కేటాయించారు. కోరుట్లకు చెందిన కాంగ్రెస్ నేత జె. వెంకట్ శనివారం సాయంత్రం పార్టీలో చేరారు. ఆయన పేరు రాత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉంది. ఆందోల్ బాబూమోహన్ - ఆర్మూర్ వినయ్‌ కుమార్‌ రెడ్డి - గద్వాల్ వెంకటాద్రిరెడ్డి - తాండూరు పటేల్ రవి శంకర్ - కామారెడ్డి వెంకట రమణారెడ్డి - కార్వాన్ అమర్‌ సింగ్ - బెల్లంపల్లి వేమాజీ - బోథ్ నుంచి ఎం.రాజు లాంటి వారికి టిక్కెట్లు కేటాయించ‌డంతో...వీరు టికెట్ల‌ కోసమే పార్టీలో చేరారని బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తండ్రి - కొడుకులకు కూడా టికెట్లిచ్చింది. గ‌తంలో ఇలాగే ప‌లువురు నేత‌ల‌కు టికెట్లు ఇవ్వ‌గా వారందరూ పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఇక మిగతా నియోజకవర్గాల్లోనూ ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే...వారిని చేర్చుకునే వ్యూహాలు అమలు చేయడం.. బీజేపీ దౌర్భాగ్య స్థితికి నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారు. అధికారంలో వ‌స్తామంటున్న పార్టీకి అభ్య‌ర్థులే దొర‌క‌డం లేదంటున్నారు.
Tags:    

Similar News