జీఎస్టీ మ‌హిమ‌.. చేతిలో పెరుగుతో అమ‌రావ‌తి ఉద్య‌మ‌నేత‌ సెటైరిక‌ల్ వీడియో!

Update: 2022-07-21 07:52 GMT
కుక్క పిల్ల‌, అగ్గిపుల్ల‌ స‌బ్బు బిళ్ల, రొట్టె ముక్క‌, బ‌ల్ల‌ చెక్క‌, అర‌టి తొక్క‌ కాదేదీ క‌విత‌క‌న‌ర్హం అని శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస‌రావు) ఒక క‌విత రాశారు. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా కాదేదీ జీఎస్టీకి అన‌ర్హం అన్న‌ట్టు అన్ని వ‌స్తువుల‌పైనా జీఎస్టీని ఎడాపెడా వాయించేస్తోంది. అప్ప‌డాలు.. జంతిక‌లు, మురుకులు.. మిక్చ‌ర్, పెరుగు - పాలు (టెట్రా), ల‌స్సీ ఇలా ప్ర‌తిదీ జీఎస్టీకి అర్హ‌మేనోయ్ అన్న‌ట్టు వాట‌న్నింటిపైనా 5 శాతం జీఎస్టీని దంచేసింది. జూలై 18 నుంచి పెరిగిన రేట్లు కూడా అమ‌ల్లోకొచ్చేశాయి.

ఈ నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన జీఎస్టీపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ అని, గృహ‌స్థీ స‌ర్వ‌నాశ్ ట్యాక్స్ అని నిప్పులు చెరుగుతున్నాయి. జీఎస్టీపైన సోష‌ల్ మీడియ‌లోనూ ఎన్నో మీమ్స్, సెటైర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇవ‌న్నీ ఫ‌న్నీగా ఉంటూ న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచుతున్నాయి.

తాజాగా అమరావ‌తి ఉద్య‌మ నేత కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఒక సెటైరిక‌ల్ వీడియో చేశారు. పెరుగు ప్యాకెట్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఐదు శాతం జీఎస్టీ విధించ‌డంతో ఆయ‌న వినూత్నంగా లూజ్ పెరుగును త‌న రెండు దోసిళ్ల‌లో తెచ్చారు.

త‌న రెండు దోసిళ్ల‌లో పెరుగును తీసుకుని ఆయ‌న ఇంటికొచ్చి త‌లుపు కొడ‌తారు. ఆయ‌న కుమార్తె వ‌చ్చి ఆ త‌లుపు తీస్తుంది. ఆయ‌న రెండు దోసిళ్ల‌లో ఉన్న పెరుగును చూస్తుంది.

డాడీ.. ఏంటి ఇది అని అడుగుతుంది. ఆయ‌న దానికి పెరుగు అని స‌మాధాన‌మిస్తారు. పెరుగు ప్యాకెట్ల‌లో ఉండాలి క‌దా అని అంటుంది. ప్యాకెట్లలో తెస్తే 5 శాతం జీఎస్టీ ప‌డుతుంది అని ఆయ‌న అంటారు. దానికి ఎవ‌రు చెప్పారని ఆయ‌న కుమార్తె అడుగుతుంది.

దానికి ఆయ‌న ఇందాక‌నే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ గారు చెప్పారు అని అంటారు. అయితే సాంబార్ తెస్తావా అని కుమార్తె అడుగుతుంది. దానికి ఆయ‌న సాంబార్ పైన జీఎస్టీ వేస్తే ఇలాగే తెస్తాను.. ఏం చేస్తాను అని అంటారు. ఇప్పుడు ఈ సెటైరిక‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో న‌వ్వులు పూయిస్తోంది. వైర‌ల్ గా మారిన ఈ వీడియోకు భారీ స్థాయిలో లైకులు, షేర్లు కామెంట్లు వ‌స్తున్నాయి.

Full View


Tags:    

Similar News