రాహుకాలంలో రాహుల్ టీం అభ్య‌ర్థి నామినేష‌న్!

Update: 2018-04-20 03:20 GMT
క‌ర్నాట‌క‌ల ఎన్నిక‌ల్లో అనేక ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వచ్చేనెల 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీజేపీలు క‌స‌రత్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌ర్వంలోనే అనేక ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ట్విస్ట్ ఉన్న ప‌రిణామ‌మే ఇది. సాధారణంగా రాజకీయ నాయకులు తిథులు - నక్షత్రాలు - మంచి ముహూర్తం చూసుకొని ఎన్నికల్లో నామినేషన్ వేస్తారు. కాగా కర్నాటక రాష్ట్ర ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ జార్కీ హోలీ రాహుకాలం సమయంలో తన నామినేషన్ వేసి సంచలనం రేపారు.

రాహుకాలంలో ఎలాంటి కొత్త పని ప్రారంభించరాదని జ్యోతిష్కులు చెబుతుంటారు. కానీ దానికి భిన్నంగా రాహుకాలంలోనే నామినేషన్ వేశారు. మూఢనమ్మకాలను పారదోలాలనే తన ప్రచారోద్యమంలో భాగంగా తాను రాహుకాలం సమయంలో నామినేషన్ వేసినట్లు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి సతీష్ వెల్లడించారు. ప్రజల్లో రాహుకాలం అంటే ఉన్న మూఢనమ్మకాన్ని పారదోలేందుకు వీలుగా తాను రాహుకాలంలో నామినేషన్ వేసి ఎన్నికల్లో విజయం సాధిస్తానని సతీష్ ప్రకటించారు. మంచి రోజు కానిదంటూ ఉండదని.. గెలుపు, ఓటములు మనం చేసే కృషి, వ్యక్తుల ఆత్మవిశ్వాసం బట్టి ఉంటుందని సతీష్ చెప్పారు. ‘‘నేను నా నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశాను, ప్రజల మద్ధతు నాకే ఉంది...అందుకే రాహుకాలం సమయంలోనే నామినేషన్ వేశాను. అయినా విజయం నాదే ’’ అని సతీష్ ధీమాగా చెప్పారు. సతీష్ గతంలో బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్మశానవాటికలో కార్యక్రమం నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవ‌డం కొస‌మెరుపు.
Tags:    

Similar News