రెండు పార్టీల్లోనూ కాక రేపుతున్న ఆ నియోజకవర్గం!

Update: 2023-06-10 16:03 GMT
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు చేతిలో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన అంబటి రాంబాబు 2019లో గెలుపొంది సత్తా చాటారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఉన్నారు.

అయితే అంబటి రాంబాబు సత్తెనపల్లి స్థానికుడు కాదు. 1989లో రేపల్లె నుంచి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999ల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిపోయారు. 2004, 2009ల్లో పోటీ కూడా చేయలేదు. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసినా పరాజయమే ఎదురైంది.

అయితే 2019లో గెలిచిన అంబటికి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్థానిక వైసీపీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ చిట్టా విజయభాస్కరరెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి స్థానిక నేతలే పోటీ చేయాలన్నారు. అవకాశమిస్తే తాను లేదంటే మరో స్థానిక నేత ఎవరైనా ఫరవాలేదని తేల్చిచెప్పారు.

మరోవైపు టీడీపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. సత్తెనపల్లి సీటును పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వైవీ ఆంజనేయులు, తెలుగు యువత నేత అబ్బూరి మల్లి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరాం ఆశించారు. అయితే బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఆ సీటును కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా నియమించారు. చంద్రబాబు నిర్ణయంపై కోడెల శివరాం బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపించారు.

మరోవైపు సత్తెనపల్లిలో తనను ఓడించడానికి వస్తాదులు వస్తున్నారంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. నియోజకవర్గ ఇంచార్జిగా నియమితుడయ్యాక సత్తెనపల్లిలో మొదటిసారి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కన్నా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంబటిపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు అంబటి వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్‌ తెచ్చుకోవాలి అంటూ సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్‌ వస్తుందని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? అని అంబటిని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నా టికెట్‌ తెచ్చుకోలేని స్థితిలో అంబటి ఉన్నాడని ఎద్దేవా చేశారు. అలాంటి అంబటి రాంబాబుకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.

అంబటి రాంబాబుపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయనను కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి లేదా బందరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలనే యోచనలో జగన్‌ ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టే అంబటి రాంబాబు సైతం అవనిగడ్డ నియోజకవర్గంలో కొద్ది రోజులు చురుగ్గా పర్యటించారు. సత్తెనపల్లి నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి లేదా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Similar News