వచ్చే వేసవిలోనే ఏపీలో ముందస్తు ఎన్నికలు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-10 08:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నాయి.

ఇప్పటికే టీడీపీ, జనసేన వంటి పార్టీలు ముందస్తు ఎన్నికలు తధ్యమని నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో చురుగ్గా తమ పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ సైతం ఈ మధ్య కాలంలో యాక్టివ్‌గానే రాజకీయాల్లో ఉంటున్నారు. మరో కొద్ది రోజుల్లో బస్సు యాత్రకు సైతం ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇక చంద్రబాబు, నారా లోకేష్‌ సైతం బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఓవైపు నియోజకవర్గాల సమీక్షలు, గట్టి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతుందన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందని సత్య కుమార్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

వైసీపీ వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని.. అందుకే ముందస్తుగా ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని జగన్‌ భావిస్తున్నారని తెలిపారు. అందుకే ముందస్తు వ్యూహానికి పావులు కదుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలంటే యుద్ధమంటూ ముఖ్యమంత్రి జగన్‌ అభివర్ణించారని సత్య కుమార్‌ గుర్తు చేశారు. జగన్‌ ముందస్తుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. రానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లరూపాయలు వెదజల్లి గెలిచేందుకు వైసీపీ ప్రణాళిక రచించుకుంటోందన్నారు. ఈ మేరకు తన దగ్గర సమాచారం ఉందని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సత్యకుమార్‌ స్పష్టం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News