వర్క్ ఫ్రమ్ హోమ్ పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

Update: 2022-01-12 09:43 GMT
ఇటీవల కాలంలో ఉద్యోగుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట వర్క్ ఫ్రమ్ హోమ్. గతంలో అయితే శాలరీ హైక్, పని గంటలు వంటి వాటిని చర్చించే ఉద్యోగులు... ఇప్పుడు మాత్రం ఇంటి నుంచి పని, వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఎంతకాలం అనుమతి అని చర్చిస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా స్పందించారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ సదస్సులో పాల్గొన్న ఆయన... ఉద్యోగులకు ఇంటి నుంచి పని అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కార్యాలయాలకు పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఎప్పుడు వస్తారనే అంశంపై ఇప్పటివరకు ఏ కంపెనీ స్పష్టమైన విధానం అంటూ ఏమీ లేదని సత్య నాదెళ్ల అన్నారు. ఆఫీసుకు రావడానికి ఉద్యోగులు సముఖత చూపడం లేదని తెలిపారు. ఈ కష్టకాలంలో రిస్క్ అవసరమా? అనే భావనలో ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా పని ఒత్తిడి పెరిగితే రాజీనామా చేయడానికి సైతం వెనుకాడడం లేదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో రాజీనామాలు ఎక్కువగా పెరిగాయని వెల్లడించారు. అందుకే ఉద్యోగుల భద్రత, సౌకర్యం దృష్ట్యా కొన్ని విధానాలు అమలు చేస్తున్నామని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా వివరించారు.

ఉద్యోగులకు ఎలాంటి హాని కలగకుండా ఉండడం కోసం వారికి నచ్చిన విధంగా హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నామని సత్య నాదెళ్ల తెలిపారు. ఇకపోతే టెక్నాలజీ పెరిగిన కొద్దీ... కంపెనీ ఉత్పత్రి పెరుగుతుందని చెప్పారు. సాంకేతికతను పెంచుకుంటే ఎక్కువశాతం ప్రొడక్టివిటీ జరిగి... తక్కువ ధరలకే ఉత్పత్తులు, సేవలు అందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కరోనా కాలంలో డిజిటల్ ప్రాధాన్యం పెరిగిందని అన్నారు.

కంపెనీలు సాంకేతికత పెంచుకొని హైబ్రిడ్ విధానంలో ఉత్పాదకతను పెంచుతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ద్రవ్యోల్బనం పెరిగే ఈ ఆర్థిక వ్యవస్థలో ధరలు తగ్గించే అత్యద్భుతమైన శక్తి డిజిటల్ కు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో చిన్నా, పెద్దా కంపెనీలు అనే తేడా లేదని అన్నారు. ఏ కంపెనీ అయినా కూడా ఉత్పత్రి పెంచుకొని.. సేవలు అతి చౌక ధరలకు అందించవచ్చని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

రాబోయే రోజుల్లో భారతదేశంలో టెక్నాలజీలో సంచలన మార్పులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి ఆర్.చంద్రశేఖర్ అన్నారు. కంప్యూటింగ్ సేవల్లో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటుందని చెప్పారు. కరోనా కారణంగా ఇప్పటికే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. కోవిడ్ వల్ల చాలా సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. భారత్ దీర్ఘకాలిక వృద్ధి పై కరోనా ఎఫెక్ట్ ఏమాత్రం లేదని టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. కేవలం ప్రస్తుతం అంశాలపై మాత్రమే కాస్త జాప్యం జరిగిందని తెలియజేశారు.
Tags:    

Similar News