రెండో ‘ఆప్’ మంత్రి అరెస్టు

Update: 2022-05-31 05:32 GMT
దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఆప్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టయ్యారు. ఈ మధ్యనే పంజాబ్ లోని ఒక మంత్రి అరెస్టయిన విషయం తెలిసిందే. పంజాబ్ మంత్రేమో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 1 శాతం కమీషన్ అడిగినందుకు ఏకంగా ప్రభుత్వమే ఏసీబీతో రైడ్ చేయించి కేసు నమోదు చేసి మరీ అరెస్టు చేయించింది. అయితే ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టుకు ఆప్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదులేండి.

2017లో నమోదైన హవాలా లావాదేవీలకు సంబంధించి ఈయనపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు బుక్ చేసింది. అప్పటి నుండి ఈ కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది.

తాజాగా జైన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు హవాలా లావాదేవీలతో సంబంధాలున్నాయని నిర్ధారణయ్యింది. గతంలోనే వీళ్ళ కుటుంబానికి చెందిన రు. 4.81 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈరోజు జైన్ ను ఈడీ అరెస్టు చేయటంతో వెంటనే మంత్రిని మంత్రివర్గంలో నుండి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తొలగించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ మధ్య కాలంలోనే వేరే వేరే రాష్ట్రాల్లో కొందరు మంత్రులు అవినీతి ఆరోపణలకు గురయ్యారు. అలాగే మహారాష్ట్రలోని నవాబ్ మాలిక్ ను అయితే ఈడీ అరెస్టు కూడా చేసింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అరెస్టయిన వారుకానీ తాము నిర్దోషులమని, తమపై ఆరోపణలన్నీ నిరాధారాలే అని చెప్పుకుంటున్నారు. అంతేకానీ కనీసం పదవులకు రాజీనామాలు చేయాలని కూడా అనుకోవడం లేదు.

కానీ ఇక్కడ ఆప్ ప్రభుత్వాలు మాత్రం ఆరోపణలొచ్చినా, లేదా దర్యాప్తు సంస్ధలు అరెస్టు చేసినా వెంటనే మంత్రులపై యాక్షన్ తీసేసుకుంటున్నాయి.

నిజంగా ఇపుడు పంజాబ్, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాలు అవినీతికి వ్యతిరేకంగా  కొత్త ఒరవడిని తీసుకొచ్చినట్లే అనుకోవాలి. దేశంలోని మిగిలిన ప్రభుత్వాలు అవినీతి నియంత్రణలో ఈ రెండు ప్రభుత్వాలను చూసి నేర్చుకుంటే కొంతకాలానికైనా అవినీతి దానంతట అదే తగ్గిపోతుంది.
Tags:    

Similar News