గ‌ల్ఫ్ లో కొత్త ప‌న్ను! ప్ర‌వాసుల‌పై మాత్ర‌మేన‌ట‌!

Update: 2018-01-01 13:39 GMT
కొత్త ఏడాది ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏ దేశ‌మైనా, ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెబుతుంద‌ని ఆశిస్తాం క‌దా. అయితే అందుకు భిన్నంగా ఉపాధి వెతుక్కుంటూ త‌మ దేశానికి వ‌చ్చి... త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ పురోభివృద్దిలో కీల‌కంగా మారిన ప్ర‌వాసుల‌పై గ‌ల్ఫ్ కంట్రీస్‌... న్యూ ఇయ‌ర్ వేళ ఓ చేదు వార్త‌ను వినిపించేసింది. కొత్త సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని నేటి నుంచి గ‌ల్ఫ్ దేశాల్లో నివ‌సిస్తున్న ఇత‌ర దేశస్థుల‌పై 5 శాతం వ్యాట్ ప‌న్ను అమ‌ల్లోకి వ‌చ్చేసింది. దీనిపై గ‌ల్ఫ్ కంట్రీస్ చాలా కాలం క్రిత‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నా... నేటి ఉద‌యం ఆ ప‌న్ను అమ‌ల్లోకి రావ‌డంతో ఈ వార్త ఇప్పుడు అక్క‌డి ప్ర‌వాసీయుల‌తో పాటు గ‌ల్ఫ్ కంట్రీస్‌ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారికి షాక్ కొట్టినంత ప‌నైంద‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతానికి నేటి ఉద‌యం నుంచి గ‌ల్ఫ్ కంట్రీస్‌ లో ప్ర‌ధాన దేశాలుగా భావిస్తున్న సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ ల్లో వ్యాట్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఈ కొత్త వ్యాట్ ప‌న్ను ఎలా వ‌సూలు చేస్తార‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌ల్ఫ్ కంట్రీస్‌కు ఇత‌ర దేశాల నుంచి ఉద్యోగులు - కార్మికులను తీసుకొచ్చే సంస్థ‌లు... ఒక్కో ఉద్యోగి - కార్మికుడికి 5 శాతం మేర వ్యాట్ ను ఆ సంస్థే ప్ర‌భుత్వానికి చెల్లించాలి. అయితే ఏ సంస్థ కూడా త‌న‌కు తానుగా ఈ ప‌న్నును భ‌రించ‌వు గ‌నుక‌... ఆ ప‌న్ను నేరుగా ఉద్యోగులు - కార్మికుల‌పైనే ప‌డ‌క త‌ప్ప‌దు. ఈ ప‌న్ను వ‌సూలు సౌదీ అరేబియాలో ఎలా ఉంటుంద‌న్న విష‌యానికి వ‌స్తే... సౌదీ అరేబియాలో విదేశీయులకు ఉద్యోగాలు కల్పించిన ప్రతి సంస్థ... ఒక్కో విదేశీ ఉద్యోగిపై నెలకు 300 రియాద్‌‌లను ఆ దేశ ప్ర‌భుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాలి. అయితే ఇప్పటికే ఈ త‌ర‌హా ప‌న్ను కింద ఒక్కో ఉద్యోగికి నెలకు 200 రియాద్‌ లు చెల్లిస్తున్నారు. దానికి అదనంగా ఇప్పుడు మ‌రో 300 రియాద్‌ లను చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఈ ప‌న్నుని  ఒక్కో ఉద్యోగిపై నెల‌కు 500 రియాద్‌ లుగా ఉండ‌నుంది. యూఏఈలోనూ ఇదే త‌ర‌హా ప‌న్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.

ఈ కొత్త ప‌న్ను కార‌ణంగా ఆయా దేశాల నుంచి గ‌ల్ఫ్ కంట్రీస్‌ కు వెళ్లే వారిపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచే గ‌ల్ఫ్ దేశాల‌కు పెద్ద సంఖ్య‌లో వ‌ల‌స వెళుతున్నారు. ఈ కొత్త ప‌న్ను లేకున్న‌ప్పుడే ఆ దేశాల‌కు వెళ్లిన మ‌న తెలుగోళ్లు నానా ఇబ్బందులు ప‌డుతున్న వైనం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కొత్త ప‌న్ను అమ‌ల్లోకి రావ‌డంతో అక్క‌డ‌కు వెళ్లే మ‌న‌వారిపై మ‌రింత ప్ర‌భావం ప‌డ‌నుంద‌న్న మాట‌. అయినా ఆర్థికంగా బ‌లమైన దేశాలుగా పేరున్న గ‌ల్ఫ్ కంట్రీస్‌కు ఈ కొత్త ప‌న్ను ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యానికి వస్తే... గల్ఫ్ కంట్రీస్‌ కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు చ‌మురే. అయితే కాల‌క్ర‌మేణా ఆ దేశాల్లోని చ‌మురు నిల్వ‌లు కుంచించుకుపోతున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే వ్యూహంలో భాగంగా గ‌ల్ఫ్ కంట్రీస్ ఈ కొత్త ప‌న్నును అమ‌ల్లోకి తీసుకొచ్చినట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News