సావ‌ర్క‌ర్‌పై మ‌రో వివాదం.. గాంధీ మునిమ‌న‌వ‌డి ఫైర్‌!

Update: 2022-11-21 14:30 GMT
సావ‌ర్క‌ర్ కేంద్రంగా రాజ‌కీయ విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌లు మ‌రింత పెరిగాయి. ఇటీవ‌ల వినాయక్ దామోదర్ సావర్కర్ పిరికివాడని, బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరుతూ సంతకం చేశారని రాహుల్ గాంధీ  చేసిన సంచలన ఆరోపణల దుమారం తగ్గకముందే దీనికి కొనసాగింపుగా సావ‌ర్కర్‌పై మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీ  సంచలన ఆరోపణలు చేశారు.

మహాత్మాగాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సేకు సావర్కర్ తుపాకీని  సమకూర్చాడని ఆరోపించారు. ''సావర్కర్ బ్రిటిష్ వారికి సహకరించడం మాత్రమే కాదు, బాపూని (గాంధీ) చంపేందుకు తుపాకీని సమకూర్చడంలో కూడా నాథూరాం గాడ్సేకు సహకరించారు'' అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

బాపూ హత్యకు రెండ్రోజుల ముందు వరకూ కూడా గాడ్సే వద్ద తుపాకీ లేదని అన్నారు. కాగా, తన ప్రకటనపై తుషార్ గాంధీ మీడియాకు మరింత వివరణ ఇస్తూ, తాను చేసింది ఆరోపణ కాదని, చరిత్రలో ఈ విషయం నమోదైందని చెప్పారు. అదే విషయం తాను చెప్పానన్నారు.

''పోలీసు రికార్డుల ప్రకారం 1948 జనవరి 26, 27 తేదీల సమయంలో నాథూరాం గాడ్సే, వినాయక్ అప్టేలు సావర్కర్‌ను కలుసుకున్నారు. అప్పటి వరకూ గాడ్సే వద్ద తుపాకీ లేదు. గన్ కోసం ముంబై అంతా ఆయన వెదికారు. ఈ పర్యటన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి గ్వాలియర్ వెళ్లారు. అక్కడ ఆయనకు మంచి పిస్తోల్ లభ్యమైంది.

బాపూ హత్య జరగడానికి రెండ్రోజుల ముందు ఇదంతా జరిగింది. అదే నేను చెప్పదలచుకున్నది. కొత్తగా చేసిన ఆరోపణలంటూ ఏమీ లేవు'' అని తుషార్ గాంధీ వివరణ ఇచ్చారు. ఇక‌, దీనిపై బీజేపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News