సేవ్ ఆంధ్రా...స్ట్రాంగ్ స్లోగన్ ?

Update: 2022-01-02 11:30 GMT
ఏపీకి ఇపుడు ఏమొచ్చింది, ఎందుకీ నినాదం అని ఎవరైనా అడగవచ్చు. అధునిక సాహిత్యం లో ఒక చతురోక్తి ఉంది. లోకం బాధ అంతా మహా కవి శ్రీశ్రీ బాధట‌. అలాగే తన బాధ అంతా లోకం బాధగా దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి మార్చి కవితలు అల్లేవారు అని మిగిలిన కవులు చెబుతారు. ఇక్కడే మన రాజకీయ నేతలు లెక్కకు మిక్కిలిగా  దేవులపల్లి వారినే అచ్చంగా ఫాలో అయిపోతున్నారు అనుకోవాలి. వారిది సిసలైన రాజకీయ బాధ, వారిది అందలం బాధ, వారిది అధికారం బాధ. దాన్ని జనాల బాధగా చూపాలి. అది సక్సెస్ అయితే పవర్ చేతిలొకి వచ్చి పడడమే ఇక. అందుకే అందమైన స్లోగన్స్ ప్రతీ ఎన్నికల్లో రెడీగా ఉంటాయి. అలా ఇపుడు మరో పవర్ ఫుల్ స్లోగన్ ఏపీ రాజకీయాలను చుట్టుముట్టనుందిట. అదే సేవ్ ఆంధ్రా.

ఏపీని కాపాడుకోవాలి. వైసీపీ పాలన  నుంచి రక్షించుకోవాలి. అరాచకపాలన నుంచి బయటపడేయాలి. ఇంతకాలం ఈ మాటలు టీడీపీ అధినేత నుంచి సగటు క్యాడర్ వరకూ అంటూ వచ్చారు. ఇపుడు అవే మాటలు తూటాలుగా మార్చి ఏపీలో జరిగే ఎన్నికల్లో గట్టిగానే ప్రయోగించబోతున్నారుట.

సేవ్ ఆంధ్రా అంటే నిజంగా వజ్రాయుధం లాంటి స్లోగనే.  నిజానికి ఇపుడు ఏపీ అనేకరకాలైన ఇబ్బందులలో  ఉంది. దానికి ఎవరు కారణం అంటే అందరికి అందరూ అనే చెప్పాలి, విభజన హామీలు అమలు చేయక కేంద్రంలోని బీజేపీ  ఏపీని డేంజర్ లోకి నెట్టింది. అలాగే వరసగా ఏపీని ఏలిన ఇద్దరు సీఎం లు చంద్రబాబు, జగన్ కూడా ఈనాటి సీన్ కి కారణం అని అంతా అంటారు. అయితే జగన్ వల్ల ఇపుడు ఏపీ అన్ని విధాలుగా దెబ్బతినిపోయింది అన్నదే టీడీపీ వాదన. ఆ పార్టీ అపోజిషన్ లో ఉంది. అదే దానికి పొలిటికల్ అడ్వాంటేజ్ మరి.

తన వాదనకు బలం చేకూర్చడానికి టీడీపీ మిగిలిన పార్టీలను కూడా కలుపుకుంటూ ఏపీలో అతి పెద్ద కురుక్షేత్ర పోరాటానికి తెర తీయనుంది. దీనికి సంబంధించి పొలిటికల్ రోడ్ మ్యాప్ కూడా  రెడీ అయింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కనుక వైసీపీ గెలిస్తే ఏపీ సర్వనాశనం అవుతుంది అన్నదే సేవ్ ఆంధ్రా స్లోగన్ వెనక ఉన్న అర్ధం పరమార్ధం.  ఈ నినాదంతో వారూ వీరూ అని లేకుండా ఏపీలోని యావత్తు విపక్షం అంతా ఒక గూటికి చేరాలని, చేర్చాలనీ టీడీపీ ప్లాన్ గా ఉందని అంటున్నారు.

తెలంగాణా రాష్ట్రం కోసం  ప్రొఫెసర్  కోదండరామ్  నాయకత్వాన జేఏసీ ఒకటి అప్పట్లో ఏర్పాటు అయితే రాజకీయ విభేదాలు కూడా పక్కన పెట్టి  అన్ని పార్టీల నేతలు అంతా వచ్చి చేరారు. ఆ విధంగా తెలంగాణా సాధన తప్ప మరో మాట లేకుడా అంతా ఉద్యమించారు. ఇపుడు అలాంటి  ఉద్యమ స్పూర్తినే ఏపీ రాజకీయాన రగిలించాలన్నది టీడీపీ మాస్టర్ మైండ్ గా చెబుతున్నారు.

ఇక సమీకరణలు  చూస్తే  ఏపీలో జనసేన టీడీపీల మధ్య పొత్తు దాదాపుగా కుదిరిపోయినట్లే అంటున్నారు. ఈ మేరకు టీడీపీ నేతల నుంచి ప్రకటనలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అదే టైమ్ లో జనసేన నుంచి మాత్రం పవన్ సహా ఎవరూ పెదవి విప్పడంలేదు. అయితే సరైన టైమ్ లో పొత్తుల ఎత్తులు తెర ముందుకు వస్తాయని అంటున్నారు. సరే పై స్థాయిలో పొత్తులు కుదురుతాయి. దిగువ స్థాయిలో క్యాడర్ తో  ఎలా అంటే అక్కడే సేవ్ ఆంధ్రా నినాదం పనిచేస్తుంది అంటున్నారు.

సేవ్ ఆంధ్రా అన్నదే అందరి మాటా బాటా కావాలి. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు, ఎవరూ కూడా తగ్గాల్సింది లేదు, ముందు ఉమ్మడి శత్రువు వైసీపీని ఓడించడానికి కలసిరావాలన్నదే ఈ స్లోగన్ వెనక ఉన్న అసలైన అర్ధం అని చెబుతున్నారు. అందువల్ల జనసేన టీడీపీలలోని దిగువ స్థాయి కార్యకర్తల   మధ్య విభేదాలు లేకుండా అంతా కలసి పనిచేయడానికి సేవ్ ఆంధ్ర స్లోగన్ ఒక రకషణ కవచంలా పనిచేస్తుంది అని అంచనా వేస్తున్నారుట.

మొత్తానికి సేవ్ ఆంధ్రా స్లోగన్ అదిరింది. తొందరలోనే దీన్ని సరైన టైమ్ వేదిక చూసి రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్నీ బాగా ఉన్నా యి కానీ సేవ్ ఆంధ్రా పేరిట ఏపీలో టీడీపీ నాయకత్వాన ఏర్పడే జేఏసీలో బీజేపీ చేరుతుందా. ఇది ఆసక్తికరమైన చర్చగానే ఉంది. అయితే ఇది ఫక్తు రాజకీయం. ఎపుడు ఎవరు ఏ గూట్లో ఉంటారు అన్నది నిర్ణయించేది ఎవరూ కాదు, జస్ట్ సిట్యువేషన్స్ మాత్రమే. మరి 2024 నాటికి పరిస్థితులు మారితే కనుక ఏమైనా జరగవచ్చు. దట్సాల్..అంతే.
Tags:    

Similar News