భారత ఆర్థిక వృద్ధిపై ఎస్‌బీఐ సంచలన నివేదిక!

Update: 2022-12-03 06:03 GMT
భారత ఆర్థిక వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వేగంగా వృద్ధి చెందుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక తెలిపింది. 2023 మొదటి త్రైమాసికంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 13.5% వృద్ధితో ఉంటుందని వెల్లడించింది.

వాస్తవానికి, 2029 నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. 2014 నుండి భారత్‌ 7 స్థానాలు పైకి ఎగబాకిందని గుర్తు చేసింది. ప్రస్తుత భారత్‌ వృద్ధిరేటు ప్రకారం 2027లో జర్మనీని, 2029 నాటికి జపాన్‌ను భారత్‌ అధిగమిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసినా చెప్పుకోదగ్గ విజయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు.

భారతదేశ వృద్ధిరేటు అంచనాలు ప్రస్తుతం 6.7 శాతం నుంచి 7.7 శాతం వరకు ఉన్నాయని ఎస్‌బీఐ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అనిశ్చితితో కూడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ వృద్ధిరేటును భారత్‌ నమోదు చేస్తుండటం గొప్ప విషయమని ఎస్‌బీఐ పేర్కొంది.

కోవిడ్‌ తదనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాలు, ఆర్థిక మాంద్యం పరిస్థితులతో ప్రపంచ దేశాల్లో వృద్ధిరేటు తగ్గుముఖం పడుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు కూడా ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగిస్తుండటంతో అనిశ్చితి నెలకొందని పేర్కొంది. అయితే భారత్‌ వృద్ధిరేటు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ పురోగమిస్తుందని అంచనా వేసింది.

రూపాయిని ప్రతిపాదికన పరిగణించి.. భారతదేశం, అమెరికా, జర్మనీల జీవన వ్యయాన్ని ఎస్‌బీఐ పోల్చింది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆహార పదార్థాల ధరలను ఎస్‌బీఐ పోల్చిచూసింది. రూ.100కు లభించే ఆహారవస్తువులు అమెరికాలో రూ.28, యూకేలో రూ.18, జర్మనీలో రూ.33 చొప్పున ప్రస్తుతం పెరిగాయి. అదే మన భారత్‌లో చూస్తే రూ.15 మాత్రమే ఆహార పదార్థాల ధరలు పెరిగాయని ఎస్‌బీఐ తెలిపింది.

ఇక ఇంధన ధరలు అమెరికాలో రూ.12, భారత్‌లో రూ.16 పెరగగా, జర్మనీ, యూకేల్లో భారీగా పెరిగాయి. యూకేలో రూ.93, జర్మనీలో రూ.62 పెరగడం గమనార్హం. జీవన వ్యయం సైతం అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ ఉందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

ఈ నేపథ్యంలో తక్కిన దేశాలతో పోలిస్తే భారత్‌లో వృద్ధి సాధ్యమని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి, ఆర్థిక మాంద్యం తదితరాలు భారత్‌ వృద్ధిని భంగపరచలేవని పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News