పక్కా స్కెచ్‌ : భీమా చేపించి , ఆ సొమ్ము కోసం హత్యలు .. ఎలా దొరికిపోయాడంటే!

Update: 2021-03-10 08:30 GMT
ఈ ప్రపంచంలో ఈజీ డబ్బు కి చాలామంది అలవాటు పడిపోయారు. దీనికోసం కొందరు దేనికైనా తెగిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి కొందరిని ఎంచుకొని , వారికీ ఇన్సూరెన్స్‌ చేయిస్తాడు. వారి భార్యలకు విషయం చెప్పేస్తాడు.  తన ముఠాతో కలిసి టార్గెట్లను హతమార్చి, రోడ్డు ప్రమాదంగా మార్చేస్తాడు. ఆ తర్వాత  క్లెయిమ్‌ ల ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం తీసుకుంటాడు. ఇలా బీమా దారుణాలకు పాల్పడుతున్న ఓ ఘరానా నేరగాడు, అతడి ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ పూర్తి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన ధీరావత్‌ రాజు గతంలో నల్లగొండలోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో ఏజెంట్‌ గా వర్క్ చేసేవాడు. జీవిత బీమా క్లెయిమ్‌ లు ఏవిధంగా పొందాలనేదానిపై పట్టు సాధించాడు. తప్పుడు బీమా క్లెయిమ్‌ లతో డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అలా.. పదేళ్ల క్రితం పాలకవీడు మండలం శూన్యపహాడ్‌ తండాకు చెందిన సక్రియా ఆత్మహత్య చేసుకోగా రూ. 14 లక్షలకు ఇన్సూరెన్స్‌ చేయించి, ఆ తర్వాత ప్రమాదంలో చనిపోయినట్లు పత్రాలు సృష్టించాడు. వచ్చిన క్లెయిమ్‌లో  రూ.30 వేలు సక్రియా భార్యకు ఇచ్చి, మిగతాది తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ దందా కి తెరతీశాడు.

వివరాల్లోకి వెళ్తే .. 2013లో మిర్యాలగూడ మండలం జటావత్‌ తండాలో రూపావత్‌ దేవా పేరిట రూ.10లక్షల పాలసీ చేయించాడు. ఆ తర్వాత అతన్ని హత్య చేసి ,  ప్రమాదంగా చిత్రీకరించాడు. రూ. 10 లక్షల క్లెయిమ్‌ లో రూ. 4 లక్షలను అతడి భార్యకు ఇచ్చి, మిగతాది తాను తీసుకున్నాడు. అలాగే , 2015లో దామరచర్ల మండలం కొండ్రపోల్‌ గ్రామానికి చెందిన పరంగి సోమయ్య పేరుతో మూడు వేర్వేరు బీమా సంస్థల్లో రూ. 14 లక్షలకు పాలసీలు వేయించాడు. లావూరి మంగూ అనే వ్యక్తితో కలిసి అతణ్ని ఇలాగే చంపేశాడు. వచ్చిన మొత్తంలో సోమయ్య భార్యకు రూ. 3 లక్షలు ఇచ్చాడు. 2014లో మిర్యాలగూడ మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన ధీరావత్‌ లాల్‌ సింగ్‌ ను కూడా ఇలాగే మంగూ, చంటీ, ఎర్రానాయక్‌ అనే వ్యక్తులతో కలిసి కడతేర్చాడు. రూ. 18 లక్షల క్లెయిమ్‌లో.. రూ. 4 లక్షలను లాలాసింగ్‌ భార్యకు ఇచ్చాడు. 2016లో కొండ్రపోల్ ‌కు చెందిన దైద హుస్సేన్‌ పేరిట రూ. 53 లక్షల పాలసీ చేయించి.. అతణ్ని చంపి.. రోడ్డు ప్రమాద క్లెయిమ్‌ చేశాడు. కొంత మొత్తాన్ని హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. 2017లో మిర్యాలగూడ మండలం రాళ్లవాగు తండాకు చెందిన తుల్యా పేరిట రూ. 60లక్షలకు బీమా చేయించాడు. అతను సాధారణంగా చనిపోతే.. ప్రమాదంగా చిత్రీకరించి, బీమా క్లెయిమ్‌ చేయించాడు.

ఇంతకీ ఎలా దొరికిపోయాడంటే .. 2020లో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని కొండ్రపోల్ ‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డిని టార్గెట్‌ గా చేసుకున్నాడు. అతని భార్య హారికను కలిసి, పథకాన్ని వివరించాడు. ఆమె మిత్రుడు వేముల కొండల్‌ అనే వ్యక్తి వీరికి సహకరించాడు. మూడు బీమా సంస్థల్లో కోటిరెడ్డి పేరిట రూ. 1.20 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించాడు. ఆ తర్వాత ఈ ముగ్గురూ కంచి శివ, ఆటోడ్రైవర్‌ సాయితో కలిసి గత నెల 24న కోటిరెడ్డిని హతమార్చారు. ఆ తర్వాత ట్రాక్టర్‌ తో తొక్కించి, ప్రమాదంగా చిత్రీకరించారు. భయపడి తప్పించుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పటి వరకు రాజు చేయించిన బీమా పాలసీల విలువ క్లెయిమ్‌ లు, నాన్‌-క్లెయిమ్‌ లు కలిపి రూ. 3.39 కోట్లుగా ఉంటుందని ఎస్పీ వివరించారు
Tags:    

Similar News