పాఠ‌శాల‌లే జైల్లు...వీహెచ్‌పీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2019-11-08 10:15 GMT
వివాదాస్పద అయోధ్య లోని రామ జన్మ భూమి - బాబ్రీ మసీదు తీర్పు రానున్న నేపథ్యం లో దేశ‌మంతటా, ప్ర‌ధానంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ప‌రిణామాలు మారుతున్నాయి. తీర్పు నేపథ్యం లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయోధ్యలోని స్కూళ్లను తాత్కాలికంగా జైళ్లు గా మార్చాలని, అనుమానితులను వాటిల్లో నిర్బంధించాలనే ప్రతిపాదన కూడా ఉన్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు 4వేల మంది సాయుధ బలగాలు పంపించింది. ప్రతిష్టాత్మకమైన కేసులో తీర్పు రానుండటంతో పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో అయోధ్య పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు.  కేసు తీర్పు ఈ నెల 18వ తేదీ లోపు వెలువడే అవకాశం ఉంది.

మ‌రో వైపు....తీర్పు అనుకూలంగా రాకుంటే ఘర్షణలు చెలరేగుతాయని, ఫలానా ప్రాంతం పై దాడులు జరుగుతాయని వస్తున్న వార్తలతో ప్రజలు కొంత కలత చెందుతున్నారు. ఓ వైపు తీర్పు ప్రభావం తమ పై ఉండబోదని ధీమా వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు వివాహాలు రద్దు చేసుకోవడమో లేదా వివాహ‌ వేదికలను జిల్లా అవతలికి మార్చడమో చేస్తున్నారు. మ‌రో వైపు....మతాలతో సంబంధం లేకుండా నగరప్రజలంతా శాంతిని కోరుకుంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమలో తాము కొట్టుకోవద్దని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం.

పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలను సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. హిందూ, ముస్లిం వర్గాల నేతలు, ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాలని కోరుతున్నారు. తీర్పు అనుకూలంగా వస్తే సంబురాలు చేసుకోబోమని, పటాకులు కాల్చడం, రంగులు చల్లుకోవడం వంటివి చేయమని, వ్యతిరేకంగా వస్తే ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టమని, నినాదాలు చేయబోమని వివిధ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు.

కాగా, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తొలిసారిగా మందిర శిల్పాల తయారీని నిలిపివేసిన‌ట్లు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మి స్తామంటూ వీహెచ్‌పీ 1990లో అయోధ్యలో నిర్మాణ్ కార్యశాలను ప్రారంభించింది. మందిరం ఆకృతిని విడుదల చేసింది. దాదాపు 30 ఏళ్లుగా రాతి శిల్పాలను, ఇతర నిర్మాణాలను రూపొందిస్తోంది. ప్రస్తుతం నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యం లో పనులను మొట్టమొదటిసారిగా నిలిపివేసినట్టు వెల్ల‌డించారు.
Tags:    

Similar News