బ్రేకింగ్ : ఏపీలో స్కూల్స్ ఓపెనింగ్ మరోసారి వాయిదా..నవంబర్‌ 2 నుంచి ప్రారంభం!

Update: 2020-09-29 17:00 GMT
కరోనా మహమ్మారి కారణంగా మూతబడిన స్కూళ్ల రీ ఓపెనింగ్‌ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఏపీలో స్కూళ్ల రీఓపెనింగ్‌ తేదీని మళ్లీ వాయిదా వేశారు. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో ఏపీ కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది... ఈ నేపథ్యంలోనే ముందు ప్రకటించిన ఆ నిర్ణయాన్ని సర్కారు వాయిదా వేసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటనలు చేశారు.

అక్టోబర్‌ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. నవంబర్‌ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. అయితే, విద్యార్థుల కోసం తలపెట్టిన ‘జగనన్న విద్యా కానుక' కిట్లను మాత్రం అక్టోబర్ 5 నుంచే పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించాలని జగన్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమం మొదలుపెట్టిన జగన్ సర్కార్.. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. పాఠశాలల పున:ప్రారంభానికి ముందే జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాకానుకను అమలు చేయాలని నిర్ణయించింది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను (3 జతల దుస్తులు, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌)ను జగనన్న విద్యా కానుక పేరుతో కిట్‌ రూపంలో అందించాలని వైసీపీ సర్కారు డిసైడైన సంగతి తెలిసిందే. స్కూళ్ల పున:ప్రారంభం నవంబర్ 2కు వాయిదా పడినప్పటికీ, జగనన్న విద్యా కానుకను మాత్రం అక్టోబర్‌ 5నుంచే అందజేస్తామన్న మంత్రి సురేశ్.. ఆ రోజు సీఎం జగన్ ఏదో ఒక జిల్లాలోని స్కూల్‌కు వెళ్లి, విద్యార్థులకు కిట్స్ అందజేస్తారని ప్రకటించారు.
Tags:    

Similar News