సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు తెరవాలని కేసీఆర్ డిసైడ్.. రూల్స్ ఇవే

Update: 2021-08-24 03:35 GMT
ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనరేమో. ఏళ్లకు ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా అమలయ్యే ఫార్ములాకు మినిమం గ్యారెంటీ ఉంటుందన్న విషయం మరోసారి తేలింది. కరోనాతో తెర మీదకు వచ్చిన లాక్ డౌన్.. ఆన్ లైన్ చదువుల్లో ‘విషయం’ ఎంతన్న విషయం తల్లిదండ్రులకు ఎప్పుడో అర్థమైంది. మొదట్లో సరదాగా అనిపించినా.. ప్రత్యక్ష బోధనకు భిన్నంగా ఆన్ లైన్ చదువులు బోర్ కొట్టేసి.. ఎప్పుడెప్పుడు స్కూళ్లు..కాలేజీలకు వెళ్లాలన్న తపన స్టూడెంట్లలోనూ కనిపిస్తోంది.

కరోనా మొదటి.. రెండో వేవ్ ల కారణంగా స్కూళ్లు..కాలేజీలు మూసివేయటం తెలిసిందే. మొదట్లో పరిమిత కాలమని భావించినా.. అది కాస్తా నెలలు దాటి ఏడాదిన్నరకు పైనే అయ్యింది. మధ్యలో కొంతకాలం స్కూళ్లు తెరిచినా అవేమీ పూర్తిస్థాయిలో కాకపోవటం.. సెకండ్ వేవ్ భయం ఉండటంతో పిల్లల్ని పెద్దగా బయటకు పంపని పరిస్థితి. గడిచిన మూడు నెలలుగా కరోనా తీవ్రత తగ్గిపోవటం.. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు ఆన్ లైన్ ఖాతాలోకే పోవటం..ఈ విద్యా సంవత్సరాన్ని (ఇప్పటికే మూడు నెలలు పోయాయి) అయినా ఆఫ్ లైన్ లోకి తీసుకొచ్చి.. గతంలో మాదిరి స్కూళ్లు.. కాలేజీలు నడపాలన్న మాట అందరిలోనూ ఎక్కువ అవుతోంది.

ఇదే సమయంలో ప్రభుత్వం సైతం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తెరిచేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంగన్ వాడీలు సహా అన్ని ప్రభుత్వ.. ప్రైవేటు బడులు.. కాలేజీల్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని.. అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలు పెట్టాలని కేసీఆర్ అధ్యక్షన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో డిసైడ్ చేశారు.

ఇందులో భాగంగా ఈ నెల 30 లోపు అన్ని స్కూళ్లు..కాలేజీలను శానిటైజ్ చేయాలని ఆదేశించారు. హాస్టల్స్ ను సైతం 30లోపు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కొన్ని గైడ్ లైన్స్ ను సిద్ధం చేశారు. అవేమంటే..
-  గ్రామాలు, పట్టణాల్లో ఇన్నిరోజులుగా మూతపడి ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలి.

-  పాఠశాలలు, విద్యాసంస్థల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్‌లదే. జిల్లాపరిషత్‌ చైర్మన్లు తమ జిల్లాల్లో, మండలాధ్యక్షులు తమ మండలాల్లో పర్యటించి.. అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా, శానిటైజేషన్‌ చేసి ఉన్నాయో లేదో పరిశీలించాలి.

-  జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్థారించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 30లోగా ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి కావాలి.
-  స్కూళ్లు, కాలేజీలను ఆగస్టు న30 కల్లా పరిశుభ్రం చేయించాలి. ఆవరణ, మరుగుదొడ్లను, నీటి ట్యాంకులను బ్లీచింగ్‌ పౌడర్, ఇతర రసాయనాలతో శుభ్రంగా కడిగించాలి. తరగతి గదులను కూడా కడిగించి, శానిటైజేషన్‌ చేయించాలి.

-  పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి కోవిడ్‌ పరీక్షలు చేయించాలి.

-  ఒకవేళ కోవిడ్‌ నిర్థారణ అయితే.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించాలి.

-  స్కూళ్లు, కాలేజీల్లో శానిటైజేషన్, మాస్కులు వంటి కోవిడ్‌ నియంత్రణ చర్యలను విద్యార్థులు విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.

-  తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, ఇతర జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలి.
Tags:    

Similar News