ఇంట్లోనూ మాస్క్, భౌతిక దూరం ఉండాల్సిందే.. హెచ్చ‌రిస్తున్న ఓ నివేదిక

Update: 2020-05-29 07:30 GMT
మ‌హ‌మ్మారి వ్యాపించ‌కుండా బ‌య‌ట‌కు వెళ్లినప్పుడు శానిటైజ‌ర్‌, మాస్క్‌లు ధ‌రించ‌డం వంటివి చేస్తున్నాం. అయితే ఇక‌పై ఇళ్ల‌ల్లోనూ వాటిని ధ‌రించాల‌ని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ వైర‌స్ వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని బీఎమ్‌జే గ్లోబల్‌ హెల్త్‌లో ప్రచురించిన ఓ నివేదిక చెబుతోంది. మనతో పాటు మన కుటుంబసభ్యులను కాపాడుకోవ‌డానికి ఇళ్ల‌ల్లోనూ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించాల‌ని సూచిస్తోంది. కుటుంబసభ్యుల మధ్య కనీసం ఒక మీటర్ భౌతిక దూరం పాటించాల‌ని చెప్పింది.

చైనాలో ఫిబ్రవరిలో నమోదైన క్లస్టర్‌ కేసులు కుటుంబాలతోనే ఆ వైర‌స్ వ్యాప్తి చెందినవ‌ని ఆ నివేదిక తెలిపింది. దాదాపు వెయ్యి క్లస్టర్‌ కేసులను పరిశీలిస్తే వాటిలో 83 శాతం కేసులు కుటుంబ సమూహాలుగా గుర్తించబడ్డాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైరస్ నిపుణుడు వు జున్యూ తెలిపారు. ఇంటిలో  కూడా మాస్క్ త‌ప్ప‌నిస‌రి అని చెబుతున్నారు.

చైనాలో ఈ వైర‌స్ వ్యాప్తిపై మ‌రో సర్వే జ‌రిగింది. చైనా రాజ‌ధాని బీజింగ్‌లోని 124 కుటుంబాలకు చెందిన 460 మందిని పరిశోధకులు పిలిపించారు. వారంతా వైరస్‌ సోకిన వ్యక్తుల కుటుంబసభ్యులు. ఇంటి శుభ్రత, ఇతర అంశాల ఎలా ఉండేవని తెలుసుకున్నారు. ఈ 124 కుంటుంబాల్లో కేవ‌లం 41 ఇళ్ల‌ల్లోనే మొదట వైరస్‌ సోకిన వారి నుంచి దాదాపు 77 మందికి వ్యాపించినట్లు పరిశోధకులు గుర్తించారు. మిగతా కుటుంబాలలో ఒకరికి వైర‌స్ సోకితే వెంట‌నే ఇంటిని, ప‌రిస‌రాలు శుభ్రం చేసుకోవ‌డం, జాగ్ర‌త్త‌లు పాటించ‌డంతో వైరస్‌ సోకలేదని పరిశోధకులు తేల్చారు. సామూహిక‌ భోజనం చేయడం, టీవీ చూడటంతో వైరస్‌ సోకే ప్రమాదం ఉంద‌ని వారి సర్వేలో తేలింది.

ఈ విష‌యంపై లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కూడా స్పందించింది. ఇంట్లో మాస్క్‌ ధరించడం ముఖ్యమైన అంశమ‌ని పేర్కొంది. బయట నుంచి ఇంటికి వచ్చిన వ్యక్తి ద్వారా కుటుంబసభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇంట్లో కూడా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో మనతో పాటు మన కుటుంబసభ్యులు కూడా సుర‌క్షితంగా ఉంటార‌ని ఆ సంస్థ తెలిపింది.

మాస్క్ ధ‌రిస్తే ఇంట్లోనూ ఇత‌ర వ్య‌క్తుల‌కు వైర‌స్ సోక‌ద‌ని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్హాల్గ్ తెలిపారు. ఈ నివేదికపై లండన్ యూనివర్సిటీ కాలేజీ డాక్టర్ ఆంటోనియో లాజారినో స్పందించారు. ఈ నివేదిక శాస్త్రీయ అధ్య‌య‌నం కాద‌ని స్ప‌ష్టం చేశారు. అధికారిక సిఫార్సులు చేయడానికి ఈ అధ్యయనం సరిపోదని తెలిపారు. ఇది వ్యక్తిగత స్థాయిలో కాకుండా కుటుంబ స్థాయిలో రూపొందించబడిందని పేర్కొన్నారు.

ఏది ఏమైనా మ‌న‌కు, మ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు వైర‌స్ సోక‌కుండా ఉండాలంటే నిరంత‌రం మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి. క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మ‌న‌తో పాటు స‌మాజం ఆరోగ్యంగా ఉంటుంది. త‌ప్ప‌క పాటించండి.
Tags:    

Similar News