బ్రెగ్జిట్ ఎఫెక్ట్; స్కాట్లాండ్ విడిపోతానంటోంది

Update: 2016-06-27 06:59 GMT
ఒకసారి విడిపోదామని డిసైడ్ అయ్యాక దాని ప్రభావం అక్కడితో ఆగదన్న మాట ఎంత నిజమన్నది తాజాగా గ్రేట్ బ్రిటన్ వ్యవహారం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కలిపి ఉంచటం కష్టం కానీ.. విడిపోవటం ఎంత ఈజీ అన్నది ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు వీలుగా ఇటీవల నిర్వహించిన రెఫరెండంలో బ్రిటన్ పౌరులు ఓటేసిన సంగతి తెలిసిందే.

బ్రెగ్జిట్ కు అనుకూలంగా తమ వాణిని వినిపించిన దాని ఫలితంగా.. గ్రేట్ బ్రిటన్ అస్తిత్వానికే మప్పు వచ్చేలా కనిపిస్తోంది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ.. గ్రేటర్ బ్రిటన్ లో భాగమైన స్కాట్లాండ్ ఇప్పుడు తన దారిన తాను పోవాలని భావిస్తోందట. పలు దేశాల రూపమైన గ్రేట్ బ్రిటన్.. బ్రెగ్జిట్ విషయంలో వచ్చిన అభిప్రాయ బేధం వారిని బ్రిటన్ నుంచి విడిపోవాలన్న విషయంలో మరింత స్పష్టత వచ్చేలా చేసిందని చెబుతున్నారు.

నిజానికి బ్రిటన్ నుంచి విడిపోవాలని రెండేళ్ల కిందట స్కాట్లాండ్ లో రెఫరెండం నిర్వహించగా.. బ్రిటన్ తో కలిసి ఉందామని 55 శాతంమంది.. విడిపోదామని 45 శాతం మంది చెప్పారు. దీంతో.. అప్పుడు విడిపోవటం సాధ్యం కాలేదు. తాజాగా బ్రెగ్జిట్ నేపథ్యంలో స్కాట్లాండ్ లో బ్రిటన్ నుంచి విడిపోవాలన్న ఆకాంక్ష భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు.  ఈ అంశంపై ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 52 శాతం మంది బ్రిటన్ నుంచి విడిపోవాలని భావిస్తున్నట్లుగా తేల్చి చెప్పటం గమనార్హం. ఈ వాదనకు మరింత బలం పెరిగితే.. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరోసారి రెఫరెండం జరగటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. గ్రేట్ బ్రిటన్ కు ఎసరు రావటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News